టీమిండియా స్టార్‌ పేసర్‌ రీ ఎంట్రీపై సందేహాలు! గౌతీ ప్లాన్‌? | Staff Should Talk to Shami Paras Mhambrey on New Coach Plan For Shami Return | Sakshi
Sakshi News home page

టీమిండియా స్టార్‌ పేసర్‌ రీ ఎంట్రీపై సందేహాలు! గౌతీ ప్లాన్‌?

Published Fri, Jul 12 2024 4:18 PM | Last Updated on Fri, Jul 12 2024 4:29 PM

Staff Should Talk to Shami Paras Mhambrey on New Coach Plan For Shami Return

వన్డే ప్రపంచకప్‌-2023 తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ. చీలమండ గాయం వేధిస్తున్నా పంటిబిగువన నొప్పిని భరించి ఐసీసీ టోర్నీని పూర్తి చేసిన ఈ ఫాస్ట్‌బౌలర్‌.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.

సొంతగడ్డపై ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌ వరకు అజేయంగా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు షమీ. అయితే, వరల్డ్‌కప్‌ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు.

అయితే, ఈ యూపీ ఎక్స్‌ప్రెస్‌ ఇంత వరకు పునరాగమనం చేయలేదు. ఐపీఎల్‌-2024తో పాటు టీ20 ప్రపంచకప్‌-2024కు కూడా దూరమయ్యాడు. తాను క్రమక్రమంగా కోలుకుంటున్నానని షమీ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసినా రీఎంట్రీపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.

పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియా తదుపరి ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు చాంపియన్స్‌ ట్రోఫీ-2025తో పాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై కన్నేసింది.

ఈ ఐసీసీ టోర్నీల్లో రాణించాలంటే సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అవసరం ఉందని టీమిండియా బౌలింగ్‌ మాజీ కోచ్‌ పారస్‌ మాంబ్రే అన్నాడు. ఈ విషయంలో కొత్త కోచింగ్‌ సిబ్బంది చొరవతీసుకోవాలని సూచించాడు.

‘‘షమీ తదుపరి ప్రణాళిక ఏమిటో కోచింగ్‌ స్టాఫ్‌ అడిగి తెలుసుకోవాలి. అతడిని సంప్రదించి.. ఫిట్‌గా ఉన్నాడా లేదా? ఇంకెన్నాళ్లు క్రికెట్‌ ఆడాలనుకుంటున్నాడు? అన్న విషయాలను అడగాలి. అతడికీ వయసు మీద పడుతోంది.

అయినా షమీ నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకోగలగాలంటే అందుకు తగ్గ వ్యూహాలు రచించాలి. జట్టుకు అదెంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. గౌతీ ఆ పని చేస్తాడని నాకు నమ్మకం ఉంది.

టెస్టుల్లో అతడిని వాడుకోవాలనుకుంటే ఆస్ట్రేలియాతో సిరీస్‌ నాటికి పూర్తిస్థాయిలో అతడు ఫిట్‌నెస్‌ సాధించేలా శిక్షణ ఇవ్వాలి. అయితే, ఆడేందుకు షమీ శరీరం సహకరిస్తేనే అన్నీ సజావుగా సాగుతాయి.

షమీ లాంటి సీనియర్ల విషయంలో యో- యో టెస్టు(ఫిట్‌నెస్‌) అవసరం లేదనే అనుకుంటా’’ అని పారస్‌ మాంబ్రే ది టెలిగ్రాఫ్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 

కాగా టీమిండియా కొత్త కోచ్‌గా గౌతం గంభీర్‌ నియమితుడైన విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే.. టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు షమీ కూడా కొన్నేళ్లుగా ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
 చదవండి: చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌.. ఇంగ్లండ్‌ తొలి ప్లేయర్‌గా రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement