నాలుగో పసిడి కైవసం
ఆంధ్ర షూటర్లు ప్రణవి–ముకేశ్‌లకు రజతం
న్యూఢిల్లీ: హరియానా టీనేజ్ షూటర్ సురుచి జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాల్ని అవలీలగా సాధిస్తోంది. ఈ టోర్నీలో ఆమె నాలుగో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆంధ్ర షూటింగ్ జోడీ నేలవల్లి ముకేశ్– ద్వారం ప్రణవి 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించింది. శుక్రవారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఈవెంట్‌లో మూడు స్వర్ణాల్ని క్లీన్‌స్వీప్ చేసిన సురుచి శనివారం 10 మీటర్ల యూత్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని గెలుచుకుంది.
సామ్రాట్ రాణాతో జోడీ కట్టిన ఆమె ఫైనల్లో 16–2తో ఉత్తరాఖండ్‌కు చెందిన అభినవ్ దేశ్వాల్–యశస్వీ జోషి జోడీపై ఏకపక్ష విజయం సాధించింది. ప్రత్యర్థి ద్వయం కనీసం ఖాతా తెరువకముందే సురుచి–సామ్రాట్ జంట 14–0తో స్పష్టమైన ఆధిపత్యాన్ని చలాయించింది. కాంస్య పతక పోరులో కర్నాటకకు చెందిన జొనాథన్ గెవిన్ ఆంథోని–అవంతిక మధు 17–13తో జస్వీర్ సింగ్ సాహ్ని–సైనా భర్వాణిలపై గెలిచింది.
10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో ముకేశ్–ప్రణవి జోడీ 12–16తో ఆర్మీ షూటర్లు రవీందర్ సింగ్–సేజల్ కాంబ్లి జంట చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. రవీందర్, సేజల్‌లకు స్వర్ణ పతకం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment