National Shooting Championship
-
షూటింగ్లో ‘స్వర్ణ’ సురుచి
న్యూఢిల్లీ: హరియానా టీనేజ్ షూటర్ సురుచి జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాల్ని అవలీలగా సాధిస్తోంది. ఈ టోర్నీలో ఆమె నాలుగో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆంధ్ర షూటింగ్ జోడీ నేలవల్లి ముకేశ్– ద్వారం ప్రణవి 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించింది. శుక్రవారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఈవెంట్లో మూడు స్వర్ణాల్ని క్లీన్‌స్వీప్ చేసిన సురుచి శనివారం 10 మీటర్ల యూత్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని గెలుచుకుంది. సామ్రాట్ రాణాతో జోడీ కట్టిన ఆమె ఫైనల్లో 16–2తో ఉత్తరాఖండ్‌కు చెందిన అభినవ్ దేశ్వాల్–యశస్వీ జోషి జోడీపై ఏకపక్ష విజయం సాధించింది. ప్రత్యర్థి ద్వయం కనీసం ఖాతా తెరువకముందే సురుచి–సామ్రాట్ జంట 14–0తో స్పష్టమైన ఆధిపత్యాన్ని చలాయించింది. కాంస్య పతక పోరులో కర్నాటకకు చెందిన జొనాథన్ గెవిన్ ఆంథోని–అవంతిక మధు 17–13తో జస్వీర్ సింగ్ సాహ్ని–సైనా భర్వాణిలపై గెలిచింది. 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో ముకేశ్–ప్రణవి జోడీ 12–16తో ఆర్మీ షూటర్లు రవీందర్ సింగ్–సేజల్ కాంబ్లి జంట చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. రవీందర్, సేజల్లకు స్వర్ణ పతకం లభించింది. -
తెలంగాణకు 3 పతకాలు
న్యూఢిల్లీ: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు సత్తా చాటారు. వ్యక్తిగత విభాగం జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో రోహిత్ కవిటి కాంస్యం గెలుచుకున్నాడు. 621.10 స్కోరుతో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. టీమ్ విభాగం జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో రోహిత్ కవిటి, అబ్దుల్ ఖలీఖ్ ఖాన్, అద్నాన్ ఖుస్రోలతో కూడిన జట్టు మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకోగా, ఈ ముగ్గురే సభ్యులుగా ఉన్న జట్టు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ సివిలియన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. చిత్తుగా ఓడిన తెలంగాణ జట్టు చెన్నై: జాతీయ సీనియర్ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఒడిషా 7–0 గోల్స్ తేడాతో తెలంగాణను ఓడించింది. ఒడిషా తరఫున దిప్సన్ తిర్కీ (24వ నిమిషం), రజిన్ కందుల్న (25, 60), అమిత్ రోహిదాస్ (31), అజయ్ కుమార్ ఎక్కా (36), నీలమ్ సంజీప్ (43), రోషన్ మిన్జ్ (57) గోల్స్ సాధించగా...తెలంగాణ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. మరో మ్యాచ్‌లో పంజాబ్ 13–0తో ఉత్తరాఖండ్‌పై ఘన విజయం సాధించింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జుగ్రాజ్ సింగ్ ‘హ్యాట్రిక్’ గోల్స్ సాధించడం విశేషం. ఇతర మ్యాచ్‌లలో ఉత్తరప్రదేశ్ 8–1తో రాజస్తాన్‌ను, పుదుచ్చేరి 6–0తో కేరళను, ఢిల్లీ 23–0తో అరుణాచల్‌ప్రదేశ్‌ను ఓడించాయి. అనీశ్ భన్వాలాకు కాంస్యం ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకంతో మెరిశాడు. దోహాలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో అనీశ్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచాడు. అనీశ్ 27 పాయింట్లు సాధించగా...పీటర్ ఫ్లోరియాన్ (జర్మనీ– 35), లీయూహాంగ్ (చైనా – 33) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. తాజా ఫలితంతో వరల్డ్ కప్ సీజన్ ముగింపు ఫైనల్ పోటీల్లో పతకం సాధించిన తొలి భారత షూటర్‌గా హరియాణాకు చెందిన అనీశ్ నిలిచాడు. ఈ ఏడాది చక్కటి ఫామ్‌లో ఉన్న 21 ఏళ్ల ఈ కుర్రాడు వరల్డ్ కప్ సీనియర్ విభాగంలో తన తొలి పతకంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్ సీనియర్ విభాగంలోనూ తన తొలి పతకాన్ని గెలుచుకున్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించడంలో అతను సఫలమయ్యాడు. మరో వైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత షూటర్ అఖిల్ షెరాన్ ఐదో స్థానంతో ముగించాడు. -
స్వర్ణం నెగ్గిన తెలంగాణ షూటర్
న్యూఢిల్లీలోని కర్ణీసింగ్ రేంజ్లో జరుగుతున్న జాతీయ షూటింగ్ ట్రయల్స్ (గ్రూప్-ఏ)లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ పసిడి పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (ట్రయల్ 1) స్వర్ణ పోరులో ఇషా.. 16-14 తేడాతో కర్ణాటకకు చెందిన దివ్యపై అద్భుత విజయం సాధించింది. దివ్య రజతంతో సరిపెట్టుకోగా.. హర్యానాకు చెందిన యశస్విని సింగ్ దూస్వాల్‌కు కాంస్య పతకం దక్కింది. మరోవైపు పురుషుల విభాగంలో సరబ్జోత్ సింగ్ స్వర్ణ పతకం సాధించగా.. శివ నర్వాల్ రజతం, అర్జన్ దాస్ కాంస్య పతకం చేజిక్కించుకున్నారు. పురుషుల 50మీ రైఫిల్ పోటీల (గ్రూప్-ఏ ట్రయల్ 2) విషయానికొస్తే.. అఖిల్ షియోరన్ స్వర్ణ పతకంతో మెరిశాడు. జూనియర్ విభాగంలో రాజస్థాన్‌కు చెందిన అమిత్ శర్మ (పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్), చండీఘడ్‌కు చెందిన సైన్యం (మహిళల 10మీ ఎయిర్ పిస్టల్), మహారాష్ట్రకు చెందిన వేదాంత్ నితిన్ (పురుషుల 3P) విజేతలుగా నిలిచారు. -
ఇషాకు రజతం.. జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ విజేత ఎవరంటే!
National Shooting Championship 2022: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజత పతకం సాధించింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో 13–17తో హరియాణాకు చెందిన ఒలింపియన్ మను భాకర్ చేతిలో ఇషా ఓడిపోయింది. దీంతో ఆమె వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కర్ణాటక షూటర్ టీఎస్ దివ్య విజేతగా నిలిచింది. కాగా భోపాల్‌లో సోమవారం ఈ టోర్నీ ముగిసింది. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్! ఆల్‌రౌండర్ అరంగేట్రం Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! -
మను భాకర్, అనీశ్‌లకు స్వర్ణాలు
భోపాల్: యువ షూటర్ మను భాకర్ జాతీయ చాంపియన్ షిప్ లో మెరిసింది. సీనియర్, జూనియర్ రెండు విభాగాల్లోనూ కలిపి ఆమె మొత్తం నాలుగు స్వర్ణాలు గెలుచుకోవడం విశేషం. ఈ క్రీడల్లో ఆమె హరియాణాకు ప్రాతినిధ్యం వహించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సీనియర్ ఈవెంట్లో 17 ఏళ్ల మను 243 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దివ్యాంశి ధామా (237.8), యశస్విని సింగ్ (217.7) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో హరియాణాకే చెందిన అనీశ్ భన్వాలా స్వర్ణం గెలుచుకున్నాడు. అనీశ్ 28 పాయింట్లు స్కోరు చేయగా... భవేశ్ షెఖావత్ (26), విజయవీర్ సిద్ధూ (22) తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
తెలంగాణకు రెండు కాంస్యాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ షాట్‌గన్ ఈవెంట్స్‌లో తెలంగాణ మహిళల జట్లు రాణించాయి. జాతీయ రైఫిల్ సంఘం ఆధ్వర్యంలో జైపూర్‌లోని రాజస్తాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఇండోర్ షూటింగ్ రేంజ్లో జరిగిన ఈ టోర్నీ మహిళల, జూనియర్ మహిళల విభాగాల్లో రెండు కాంస్యాలను సాధించాయి. సోమవారం జరిగిన మహిళల క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ జాతీయ చాంపియన్‌షిప్ టీమ్ ఈవెంట్లో జహ్రా ముఫద్దల్ దీసవాలా, రష్మీ రాథోడ్, దండు కాత్యాయిని రాజులతో కూడిన తెలంగాణ జట్టు ఆకట్టుకుంది. ఫైనల్లో ఓవరాల్‌గా 319 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. జూనియర్ మహిళల క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ ఈవెంట్లో జహ్రా ముఫద్దల్ దీసవాలా, దండు కాత్యాయిని, సొనాలీ రాజులతో కూడిన తెలంగాణ బృందం 304 పాయింట్లు స్కోర్ చేసి కాంస్యాన్ని అందుకుంది. జాతీయ స్థాయి స్కీట్ షూటింగ్ మహిళల టీమ్ విభాగంలో తెలంగాణ జట్టు కాంస్యాన్ని సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
రికార్డు స్కోరుతో స్వర్ణం
తిరువనంతపురం: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షూటర్ జీతూరాయ్ పసిడి గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఫైనల్ పోరులో రికార్డు స్థాయిలో 233 పాయింట్లు సాధించి పసిడితో మెరిశాడు. ఈ ఫైనల్ ఈవెంట్లో జీతూరాయ్ సాధించిన 233 స్కోరే అత్యధికం కావడం ఇక్కడ విశేషం. మరొకవైపు ఓంకార్ సింగ్ (222.4), జై సింగ్ (198.4) వరుసగా రజతం, కాంస్యం దక్కించుకున్నారు. జట్టు విభాగంలో జీతూ, ఓం ప్రకాశ్, జై సింగ్‌ల బృందం 1658 పాయింట్లతో స్వర్ణాన్ని సాధించింది. ఎయిర్ ఫోర్స్ జట్టు (1626)కు రజతం, పంజాబ్ (1624) కాంస్యం దక్కాయి. జూనియర్ పురుషుల విభాగంలో అర్జున్ సింగ్ చిమా 226.5 పాయింట్లతో స్వర్ణం గెలిచాడు. సురీంద్ సింగ్ (221.9), అమోల్ జైన్ (205.1) తో రజత, కాంస్యాలు సాధించారు. -
ఇప్పటికింకా నా వయస్సు
నిండా అరవై ఐదేళ్లే! న్యూఢిల్లీ: ఆమె వయసు 65 సంవత్సరాలు ... సాధారణంగా ఈ వయసులో చాలా మంది మంచానికి పరిమితమైతే, కాస్త చేవ ఉన్నవారు నాలుగు అడుగుల మార్నింగ్ వాక్‌తో సరిపెడతారు. ఇక కంటిచూపునకు సంబంధించిన సమస్యలు రావడం సరేసరి! కానీ ఢిల్లీకి చెందిన నిర్మల్ యాదవ్ మాత్రం అలా ఆగిపోలేదు. వయసు అరవై ఐదేళ్లు అయితేనేమి, ఆటలో మేటినే అంటూ తుపాకీ చేత పట్టి రికార్డులపై గురి పెట్టింది. జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో చెలరేగి ఔరా అనిపించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (వెటరన్ విభాగం)లో నిర్మల్ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పి స్వర్ణం సొంతం చేసుకుంది. మొత్తం 400 పాయింట్లకుగాను ఆమె 341 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. మాజీ మేజర్ జనరల్ భార్య అయిన ఆమె, ఇటీవలే జైపూర్‌లోనూ జరిగిన కర్నిసింగ్ స్మారక షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. ఢిల్లీలోని టాప్‌గన్ షూటింగ్ అకాడమీలోనే ఆమె రెండేళ్ల క్రితం శిక్షణ ప్రారంభించి వరుస విజయాలు అందుకోవడం విశేషం. తాజా రికార్డుపై ఆమె మాట్లాడుతూ ‘రికార్డు నెలకొల్పడం చాలా ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో మరింత మెరుగైన ప్రదర్శన కోసం శ్రమిస్తాను’ అని చెప్పింది. బోర్డు ‘పాలకుల’ ఎంపిక రేపు! న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బీసీసీఐ వ్యవహారాలను నడిపించేందుకు ముగ్గురు అడ్మినిస్ట్రేటర్ల ఎంపిక శుక్రవారం జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి గురువారమే ఈ పేర్లను ప్రకటించాల్సి ఉన్నా, అది వాయిదా పడింది. ఈ కేసు కోర్టు జాబితా క్రమంలో 20వ తేదీన ఉందని, తాను కూడా కొన్ని పేర్లను ప్రతిపాదించబోతున్నట్లు బీహార్ సంఘం కార్యదర్శి ఆదిత్యవర్మ వెల్లడించారు.