ఎక్కడ విశ్వక్రీడలు జరిగినా... కొద్దో గొప్పో వింతలు, విశేషాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఈ టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకం ద్వారా ఓ చిన్ని దేశం సంగతులు తెలిసొచ్చాయి. ఆ పతకాన్ని అలెజాండ్రా పెరిలి షూటింగ్‌లో గురి పెడితే ఆమె దేశం సాన్ మరినో గురించి మనకందరికీ ఇలా తెలిసొచ్చింది.
టోక్యో: ఐరోపాకు చెందిన సాన్ మరినో దేశం గురువారం రాత్రి ఒలింపిక్స్ పుటలకెక్కింది. జనాభా పరంగా పతకం గెలిచిన అతి చిన్న దేశంగా ఘనత వహించింది. ఎన్నో ఏళ్ల నుంచి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నా... సాన్ మరినోని ప్రపంచానికి గొప్పగా పరిచయం చేసింది మాత్రం 33 ఏళ్ల అలెజాండ్రా పెరిలినే! ఈ మహిళా షూటర్ సాధించిన కాంస్యమే ఆ దేశానికి ఇప్పుడు బంగారంతో సమానం. మహిళల ట్రాప్ ఈవెంట్‌లో పెరిలి మూడో స్థానంలో నిలిచింది. ఈ వెటరన్ షూటర్ ఒలింపిక్స్‌లో ఆడటం ఇదేం తొలిసారి కాదు. లండన్–2012 ఒలింపిక్స్ నుంచే పతకంపై గురి పెడుతూ వచ్చింది. అక్కడ త్రుటిలో పతకాన్ని కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత రియో ఒలింపిక్స్ (2016)లోనూ పాల్గొన్నప్పటికీ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగింది. అంత మాత్రాన తన పనైపోయిందని, మూడు పదుల వయసు దాటిందని ఇక చాలనుకోలేదు. కఠోరంగా ప్రాక్టీస్ చేసి టోక్యోలో కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో పెరిలి 29 పాయింట్లు స్కోరు చేసింది. ఈ ఈవెంట్‌లో స్లొవేకియా అమ్మాయి స్టెఫెస్‌కొవా (43 పాయింట్లు) బంగారం గెలిస్తే... కైల్ బ్రౌనింగ్ (అమెరికా–42 పాయింట్లు) రజతం నెగ్గింది.
జనాభా 34 వేలు మాత్రమే...
సాన్ మరినో ఓ యూరోపియన్ యూనియన్ దేశం. సాన్ మరినో చుట్టూ ఇటలీ ఉంటుంది. జనాభా కేవలం 34 వేలు మాత్రమే! మన రాష్ట్రంలోని పట్టణాల్లో నివసించే జనం కంటే తక్కువే కదా! కానీ ఒలింపిక్స్‌కు కొత్తేం కాదు. 60 ఏళ్ల క్రితం నుంచే రోమ్ ఒలింపిక్స్ (1960) నుంచి విశ్వక్రీడలు ఆడటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఓ పతకంపై గురిపెట్టింది. పతకం సాధించిన అతి తక్కువ జనాభా గల దేశంగా రికార్డులకెక్కింది. కేవలం మూణ్నాలుగు క్రీడాంశాల్లో పాల్గొనే సాన్ మరినో ఒలింపిక్ కమిటీ ఆశలన్నీ షూటర్లపైనే! పెరిలి కంటే ముందు ఒలింపిక్స్‌లో సాన్ మరినో దేశం అత్యుత్తమ ప్రదర్శన ఐదో స్థానం. అది కూడా షూటింగ్‌లోనే! లాస్ ఏంజిల్స్ (1984)లో ఫ్రాన్సెసొ నని పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. దీన్ని లండన్‌లో పెరిలి నాలుగో స్థానంతో సవరించింది. షూటింగ్‌తో పాటు రెజ్లింగ్, స్విమ్మింగ్, జూడో ఈవెంట్లలో సాన్ మరినో క్రీడాకారులు పాల్గొంటారు.
ఫైనల్లో ఐదో షూటర్ నిష్క్రమించగానే నేను గట్టిగా మనసులో అనుకున్న... మరోసారి నాలుగో స్థానంలో నిలవొద్దని! చివరిదాకా ఏకాగ్రతతో గురిపెట్టాను. తుదకు పోడియంలో నిలిచాను. నాకు, నా దేశానికి ఇదే తొలి పతకం. మా చిన్న దేశానికి ఇదే పెద్ద గర్వకారణం. బహుశా మా వాళ్లంతా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారేమో. –పెరిలి
Comments
Please login to add a commentAdd a comment