మోర్గాన్ , కోహ్లి
టి20ల్లో టాప్–2 జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. కోహ్లి సేన టెస్టు సిరీస్‌ను ‘అనుకూలత’లతో నెగ్గినా... టి20ల్లో నంబర్‌వన్ ఇంగ్లండ్‌తో అంత సులువు కాదు. మెరుపుల సంగ్రామంలో రెండూ కూడా మెరుగైన జట్లే! దీంతో మొటెరా మోతెక్కడం ఖాయం. ప్రేక్షకులకు మెరుపుల విందు సిద్ధం.
అహ్మదాబాద్: టెస్టుల్ని స్పిన్‌తో దున్నేసిన భారత్‌కు పొట్టి ఆటలో దీటైన పోరే ఎదురు కానుంది. ప్రపంచ నంబర్‌వన్ టి20 జట్టు ఇంగ్లండ్ ఈ ఫార్మాట్‌లో అసాధారణ ఆటతీరుతో దూసుకెళ్తుంది. అలాగని భారత్ ఇందులో తక్కువని కాదు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ ముస్తాక్ అలీ టోర్నీల్లో భారత కుర్రాళ్లు రాటుదేలారు. ఎప్పుడైనా అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐదు టి20ల సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశముంది. దీంతో ప్రతీ మ్యాచ్ ప్రేక్షకులకు సిసలైన క్రికెట్ పసందునే పంచనుంది. ఇందులో భాగంగా శుక్రవారం తొలి సమరం జరగనుంది.
రాహుల్–రోహిత్‌ల ఓపెనింగ్
సీనియర్లు ఫామ్‌లో ఉంటే... కుర్రాళ్లేమో జోరు మీదున్నారు. దీంతో భారత తుది జట్టు కసరత్తు టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. అందుకేనేమో మ్యాచ్ మొదలయ్యే క్షణం దాకా ఈ భారం మోయలేకే ఓపెనింగ్ జోడీని కెప్టెన్ కోహ్లి తేల్చేశాడు. హిట్‌మ్యాన్ రోహిత్‌కు జోడీగా లోకేశ్ రాహుల్ దిగుతాడని ప్రకటించాడు. దీంతో ధావన్ బెంచ్‌కే పరిమితం కాకతప్పదు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రతీ స్థానంలోనూ మునుపెన్నడు లేనంత తీవ్రమైన పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో జట్టుకు ఎంపికైనప్పటికీ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు ఆడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలు ఖాయమైన తుది జట్టులో వాళ్లిద్దరికి చోటు అసాధ్యమే. లోకల్ బాయ్ అక్షర్ పటేల్ కంటే బ్యాటింగ్‌లో మెరుగైన వాషింగ్టన్ సుందర్‌వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది. పేస్ విభాగంలో భువీ, శార్దుల్, సైనీలున్నారు.
అంతా కొట్టేవాళ్లే
ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ భారత్ కంటే కాస్త మెరుగనే చెప్పాలి. తుది జట్టుకు ఆడే 11 మందిలో పది మందికి బ్యాటింగ్, హిట్టింగ్ బాగా తెలుసు. ఓపెనర్లు జేసన్ రాయ్, బట్లర్‌లతో పాటు టి20 స్పెషలిస్టు డేవిడ్ మలన్, బెయిర్ స్టో, ఆల్‌రౌండర్ స్టోక్స్, కెప్టెన్ మోర్గాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్చర్ దాకా ఆడేసేవాళ్లే అందుబాటులో ఉన్నారు. భారత్ స్పిన్ దెబ్బతీసినా... కాసిన్ని ఓవర్ల (20)లో పదో వరుస దాకా ఉన్న బ్యాటింగ్ బలం జట్టుకు వరం. బౌలింగ్‌లో రషీద్, జోర్డాన్, మొయిన్ అలీలు భారత బ్యాట్స్‌మెన్‌కు తప్పకుండా సవాళ్లు విసురుతారు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య సాగే ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆద్యంతం రసవత్తరంగానే సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, శ్రేయస్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, శార్దుల్, భువనేశ్వర్, చహల్, సైనీ.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలన్, బెయిర్‌స్టో, స్టోక్స్, మొయిన్ అలీ, సామ్ కరన్, జొర్డాన్, ఆర్చర్, మార్క్‌వుడ్, రషీద్.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్. దీంతో భారీ స్కోర్లు ఖాయం. స్పిన్నర్లు కూడా కొంత ప్రభావం చూపించగలరు. ఈ విషయంలో భారత్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. వేసవి మొదలవడంతో వర్షం ముప్పు లేనే లేదు.
Comments
Please login to add a commentAdd a comment