
బంగ్లాదేశ్ నుంచి తరలించిన ఐసీసీ
అక్టోబర్ 3 నుంచి 20 వరకు మెగా టోర్నీ
దుబాయ్: ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అక్టోబర్‌లో అక్కడ జరగాల్సిన మహిళల టి20 ప్రపంచకప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి తరలివెళ్లింది.
ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో హింస చెలరేగగా... ముందు జాగ్రత్తగా మహిళల టోర్నీని అక్కడి నుంచి తరలించినట్లు ఐసీసీ వెల్లడించింది. దీంతో అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్, షార్జాలో మహిళల తొమ్మిదో టి20 ప్రపంచకప్ జరగనుంది. ‘మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది.
కానీ పరిస్థితులు సహకరించక పోవడంతో మెగా టోర్నీని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చి0ది. బీసీబీ ఆతిథ్యంలోనే యూఏఈలో మహిళల టి20 వరల్డ్‌కప్ జరుగుతుంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌కు మరిన్ని ఐసీసీ టోర్నీలు నిర్వహించే అవకాశం ఇస్తాం. మహిళల వరల్డ్‌కప్ నిర్వహించేందుకు ముందుకు వచ్చిన యూఏఈ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్‌డైస్ తెలిపారు.