తెలుగు టైటాన్స్‌ తడాఖా | Telugu Titans won by 22 points against Haryana Steelers | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్‌ తడాఖా

Published Tue, Nov 19 2024 4:20 AM | Last Updated on Tue, Nov 19 2024 4:20 AM

Telugu Titans won by 22 points against Haryana Steelers

‘టాపర్‌’ హరియాణా స్టీలర్స్‌పై 22 పాయింట్ల తేడాతో ఘనవిజయం 

అదరగొట్టిన ఆశిష్, విజయ్‌   

నోయిడా: తెలుగు టైటాన్స్‌ ఈ సీజన్‌లో చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న హరియాణా స్టీలర్స్‌కు ఊహించని షాక్‌ ఇచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు పది మ్యాచ్‌లాడిన హరియాణా స్టీలర్స్‌ కేవలం 2 మ్యాచ్‌ల్లోనే ఓడి, ఎనిమిదింట విజయం సాధించిది. అలాంటి మేటి ప్రదర్శన కనబరుస్తున్న హరియాణాపై తెలుగు టైటాన్స్‌ సాధికార విజయం సాధించింది. 

సోమవారం జరిగిన ఈ పోరులో కీలకమైన ఆటగాడు, కెప్టెన్ పవన్‌ సెహ్రావత్‌ గాయంతో బరిలోకి దిగలేదు. అయినా సరే టైటాన్స్‌ 49–27తో స్టీలర్స్‌కు ఊహించని పరాజయాన్ని రుచి చూపించింది. ఆట ఆరంభమైన పది నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్‌ రెయిడర్లు, డిఫెండర్లు సత్తా చాటుకోవడంతో హరియాణా ఆలౌటైంది. 

సరిగ్గా ప్రథమార్ధం ముగిసే సమయానికి (20 నిమిషాలు) మళ్లీ ఆలౌట్‌ చేసిన టైటాన్స్‌ ఆధిక్యాన్ని 23–11కు పెంచకుంది. ద్వితీయార్ధంలో స్టీలర్స్‌ పాయింట్లు చేసినప్పటికీ క్రమం తప్పకుండా తెలుగు టైటాన్స్‌ చేస్తున్న స్కోరును ఏ దశలోనూ చేరుకోలేకపోయింది. 

రెయిడర్లు ఆశిష్‌ నర్వాల్‌ (11 పాయింట్లు), కెపె్టన్‌ విజయ్‌ మలిక్‌ (8) అదరగొట్టారు. డిఫెండర్‌ సాగర్, ఆల్‌రౌండర్‌ శంకర్‌ చెరో 5 పాయింట్లు చేశారు. హరియాణా తరఫున కెప్టెన్‌ రాహుల్‌ (6), ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ రెజా (5), రెయిడర్‌ జయసూర్య (5) రాణించారు. ప్రస్తుతం 10 మ్యాచ్‌లాడిన తెలుగు జట్టు ఆరో విజయంతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది.  

అనంతరం హోరాహోరిగా జరిగిన రెండో మ్యాచ్‌లో యు ముంబా 38–37 ఒకే ఒక్క పాయింట్‌ తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. ముంబా తరఫున రెయిడర్‌ అజిత్‌ చౌహాన్‌ (10) ఆకట్టుకున్నాడు. అమిర్‌ మొహమ్మద్, కెప్టెన్‌ సునీల్‌ కుమార్‌ చెరో 4 పాయింట్లు చేశారు. 

బెంగళూరు జట్టులో ప్రదీప్‌ నర్వాల్‌ (10), సుశీల్‌ (6), నితిన్‌ రావల్‌ (6) రాణించారు. నేడు జరిగే పోటీల్లో పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్‌ (రాత్రి 8 గంటల నుంచి)... బెంగళూరు బుల్స్‌తో పట్నా పైరేట్స్‌ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement