ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఒకడు. భారత్‌కు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ జార్ఖండ్ డైనమైట్ హయాంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్లు వెలుగులోకి వచ్చారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోని సొంతం.
అలాంటి ఈ లెజెండరీ ఆటగాడికే క్రికెట్ రూల్స్ తెలియవట!.. ఈ మాట అన్నది మరెవరో కాదు.. ధోని సతీమణి సాక్షి. ‘నీకు రూల్స్ తెలియవు.. నేను చెప్పినట్లే జరుగుతుంది’ అని భర్తకే పాఠాలు చెప్పినంత పనిచేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ధోనినే వెల్లడించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..?!
బౌలర్ వైడ్ బాల్ వేశాడు
‘‘ఓరోజు నేను, సాక్షి కలిసి ఇంట్లో వన్డే మ్యాచ్ చూస్తున్నాం. సాధారణంగా ఇద్దరం కలిసి టీవీ చూస్తున్నపుడు మేము క్రికెట్ గురించి మాట్లాడుకోము. అయితే, ఆరోజు మ్యాచ్‌లో.. బౌలర్ వైడ్ బాల్ వేశాడు. బ్యాటర్ మాత్రం షాట్ ఆడేందుకు ముందుకు రాగా.. వికెట్ కీపర్ బంతిని అందుకుని స్టంపౌట్ చేశాడు. అయితే, నా భార్య మాత్రం అతడు అవుట్‌కాలేదనే అంటోంది.
అప్పటికు ఆ బ్యాటర్ పెవిలియన్ వైపు వెళ్లిపోతున్నాడు. అయినా సరే.. అంపైర్లు అతడిని వెనక్కి పిలిపిస్తారని.. వైడ్ బాల్‌లో స్టంపౌట్ పరిగణనలోకి తీసుకోరని వాదిస్తోంది. అప్పుడు నేను.. వైడ్‌బాల్‌కి స్టంపౌట్ అయినా అవుటైనట్లేనని.. కేవలం నో బాల్ వేసినపుడు మాత్రమే బ్యాటర్ స్టంపౌట్ కాడని చెప్పాను. అయినా సరే తను వినలేదు.
నీకు క్రికెట్ గురించి తెలియదు.. ఊరుకో అంటూ నన్ను కసిరింది. థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత సదరు బ్యాటర్ వెనక్కి వస్తాడు చూడంటూ చెబుతూనే ఉంది. అయితే, అప్పటికే ఆ బ్యాటర్ బౌండరీ లైన్ దాటి వెళ్లిపోవడం.. కొత్త బ్యాటర్ రావడం జరిగింది.
ఏదో తప్పు జరిగింది
అప్పుడు కూడా సాక్షి.. ‘ఏదో తప్పు జరిగింది’ అంటూ తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేసింది’’ అంటూ ధోని ఓ ఈవెంట్లో చెప్పాడు. తన భార్యతో జరిగిన సరదా సంభాషణను ప్రేక్షకులతో పంచుకుని నవ్వులు పూయించాడు. అదీ సంగతి!!
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ధోని ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన ఒంట్లో శక్తి ఉన్నన్ని రోజు ఆడుతూనే ఉంటానని 43 ఏళ్ల తలా అభిమానులకు శుభవార్త అందించాడు.
చదవండి: శతక్కొట్టిన కృనాల్ పాండ్యా.. ‘మా అన్న’ అంటూ హార్దిక్ పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment