న్యూయార్క్: ప్రతికూల పరిస్థితుల్లోనూ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను దిగ్విజయంగా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్‌టీఏ) ఈ మెగా ఈవెంట్ ప్రైజ్‌మనీ వివరాలను వెల్లడించింది. ఈసారి పురుషుల, మహిళల సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన వారికి 30 లక్షల డాలర్ల (రూ. 22 కోట్ల 51 లక్షలు) చొప్పున లభిస్తాయి. ఓవరాల్‌గా యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రైజ్‌మనీ 5 కోట్ల 34 లక్షల డాలర్లు (రూ. 400 కోట్లు) కావడం విశేషం.
ఈ మొత్తం కాకుండా... కరోనా కారణంగా అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలు ఆగిపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆటగాళ్లకు సహాయం నిమిత్తం 76 లక్షల డాలర్లను (రూ. 57 కోట్లు) అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) క్రీడాకారుల సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి తొలి రౌండ్‌లో ఓడిన వారికి ఐదు శాతం ప్రైజ్‌మనీ పెంచారు. గత సంవత్సరం 58 వేల డాలర్లు ఇవ్వగా... ఈసారి తొలి రౌండ్‌లో వెనుదిరిగిన వారికి 61 వేల డాలర్లు (రూ. 45 లక్షల 77 వేలు) లభిస్తాయి. కరోనా కారణంగా ఈసారి యూఎస్ ఓపెన్ టోర్నీని నేరుగా మెయిన్ ‘డ్రా’తో మొదలుపెట్టనున్నారు. క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌ను నిర్వహించడంలేదు.
ప్రైజ్‌మనీ వివరాలు
సింగిల్స్ విజేత (పురుషులు, మహిళలు)
30 లక్షల డాలర్లు∙(రూ. 22 కోట్ల 51 లక్షలు)
రన్నరప్ 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 25 లక్షలు)
సెమీఫైనల్ – 8 లక్షల డాలర్లు (రూ. 6 కోట్లు)
క్వార్టర్ ఫైనల్ – 4 లక్షల 25 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 18 లక్షలు)
Comments
Please login to add a commentAdd a comment