యూఏఈ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ సెకెండ్ లెగ్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, అట్టడుగు స్థానంలో ఉన్న కేకేఆర్‌ను ఫైనల్ దాకా తీసుకెళ్లిన యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ చాలామందికి గర్తుండే ఉంటాడు. ఆ సీజన్‌లో బ్యాట్‌తోనూ బంతితోనూ మెరుపులు మెరిపించి, టీమిండియాకు సరికొత్త ఆశాకిరణంలా అగుపించిన ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు ఈ మధ్యకాలంలో టార్చ్ లైట్ పెట్టి వెతికినా కనిపించడం లేదు. దీంతో చాలామంది భారత క్రికెట్ అభిమానులు ఈ యువ ఆల్‌రౌండర్‌కు ఏమైందని, ఎక్కడికెళ్లిపోయాడని ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా వెంకటేశ్ అయ్యరే స్వయంగా సోషల్‌మీడియా ముందుకు వచ్చాడు. తను ఎక్కడికీ పోలేదని. దేశవాలీ టోర్నీల్లో బిజీగా ఉన్నానని తనను గుర్తు చేసుకున్న అభిమానులను పలకరించాడు. టీమిండియాలో తన జాడ లేదని కొందరు అభిమానులు అతన్ని ప్రశ్నించగా.. జట్టుతో అతను ట్రావెల్ చేసిన కొద్దిపాటి జర్నీని షేర్ చేసుకున్నాడు.
ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత టీమిండియా తరఫున తనకు అవకాశాలు వచ్చినప్పటికీ.. తను అనుకున్న రీతిలో ఓపెనర్‌గా బరిలోకి దిగలేకపోయానని, జట్టు తనను ఫినిషర్ పాత్రలో వాడుకోవాలని భావించిందని, ఆ పాత్రకు నేను న్యాయం చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు. తనకు దొరికిన కొద్దిపాటి అవకాశాల్లో అడపాదడపా రాణించినప్పటికీ.. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేయలేకపోయానని, ఈ లోపు హార్ధిక్ పాండ్యా టీమిండియాలోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిపాడు.
ఐపీఎల్-2022, ఆసియా కప్, వరల్డ్‌కప్ సక్సెస్‌లతో హార్ధిక్ జట్టులో పాతుకుపోయాడని, అతని హవాలో తాను కనుమరుగయ్యానని వాపోయాడు. జట్టుకు ఎంపికైన సమయంలో కోచ్, కెప్టెన్ తనకు వీలైనన్ని అవకాశాలిస్తామని ప్రామిస్ చేశారని, ఈ లోపే హార్ధిక్ కుదురుకోవడంతో తన అవసరం వారికి లేకుండా పోయిందని అన్నాడు. దేశవాలీ టోర్నీల్లో రాణించినప్పటికీ సెలెక్టర్లు తనను పరిగణలోకి తీసుకోలేదని, టీ20 వరల్డ్‌కప్‌లో తన సత్తాను నిరూపించుకోవాలని చాలా కలలు కన్నానని, కానీ తన టైమ్ బాగాలేక ఇలా ఉండిపోయానని తన గోడును వెల్లబుచ్చుకున్నాడు.
కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్.. ఐపీఎల్ 2021లో 10 మ్యాచ్‌ల్లో 129 స్ట్రయిక్ రేట్‌తో 370 పరుగులు చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అనంతరం టీమిండియాలో చోటు దక్కించుకుని 2 వన్డేలు, 9 టీ20 ఆడాడు. అయితే అతనికి లోయర్ మిడిలార్డర్‌లో అవకాశాలు రావడంతో పెద్దగా రాణించలేక, జట్టుకు దూరమాయ్యడు.
Comments
Please login to add a commentAdd a comment