రెండో సీడ్‌ జోడీకి షాక్‌.. సెమీస్‌లో జీవన్‌-ప్రశాంత్‌ ద్వయం | Vijay Sundar Prashanth And Jeevan Nedunchezhiyan Upset Second Seed To Reach Hangzhou Open Semifinals | Sakshi
Sakshi News home page

రెండో సీడ్‌ జోడీకి షాక్‌.. సెమీస్‌లో జీవన్‌-ప్రశాంత్‌ ద్వయం

Published Sun, Sep 22 2024 3:40 PM | Last Updated on Sun, Sep 22 2024 3:51 PM

Vijay Sundar Prashanth And Jeevan Nedunchezhiyan Upset Second Seed To Reach Hangzhou Open Semifinals

హాంగ్జౌ: భారత టెన్నిస్‌ జంట జీవన్‌ నెడుంజెళియన్‌ – ప్రశాంత్‌ ఏటీపీ టోర్నీ హాంగ్జౌ ఓపెన్‌ డబుల్స్‌లో సెమీస్‌లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో  నెడుంజెళియన్‌ –ప్రశాంత్‌  6–7 (4/7), 7–6 (8/6), 10–8తో రెండో సీడ్‌ జులియన్‌ కాశ్‌ –లాయిడ్‌ గ్లాస్‌పూల్‌ (బ్రిటన్‌) జోడీపై చెమటోడ్చి గెలిచారు. 

మ్యాచ్‌ ఆరంభం నుంచి పోటాపోటీగా జరిగిన ఈ పోరులో టైబ్రేక్‌కు దారితీసిన తొలిసెట్‌ను భారత ద్వయం కోల్పోయింది. తర్వాత రెండో సెట్‌లో తమకన్నా మెరుగైనా ర్యాంకు జంటతో దీటుగా పోరాటం చేసింది. వరుసగా ఈ సెట్‌ కూడా టైబ్రేక్‌ దాకా వెళ్లినా... భారత జోడీ ఈ సెట్‌లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా గెలిచి పోటీలో నిలిచింది. 

నిర్ణాయక మూడో సెట్‌లోనూ ఇరు జోడీలు ఏమాత్రం తగ్గలేదు. నువ్వానేనా అన్నట్లు ప్రతి పాయింట్‌ కోసం శ్రమించాయి. చివరకు భారత ద్వయం 10–8తో గెలిచి ఊపిరి పీల్చుకుంది. రెండు గంటల పాటు ఈ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌  జరిగింది. సెమీస్‌లో మూడో సీడ్‌ ఎరియెల్‌ బెహర్‌ (ఉరుగ్వే)–రాబర్ట్‌ గెలొవే (అమెరికా) జంటతో భారత ద్వయం తలపడుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement