ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు భారత్ బిడ్
సాక్షి, చెన్నై: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ గురువారం టొరంటో నుంచి స్వస్థలం చెన్నై చేరుకున్నాడు. అతనికి చెన్నై విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. టోర్నీ సమయంలో గుకేశ్ వెంట తండ్రి రజినీకాంత్ ఉన్నారు. విమానాశ్రయంలో గుకేశ్ తల్లి పద్మ కుమారితోపాటు ఇతర కుటుంబ సభ్యులు, అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్యులు గుకేశ్‌కు స్వాగతం పలికారు.
‘టైటిల్ గెలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా కెరీర్‌ను తీర్చిదిద్దడంలో దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ పాత్ర ఎంతో ఉంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక ఈ ఏడాది చివర్లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగే ప్రపంచ చాంపియన్íÙప్ మ్యాచ్ కోసం సన్నద్ధమవుతాను’ అని వచ్చే నెలలో 18 ఏళ్లు పూర్తి చేసుకోనున్న గుకేశ్ వ్యాఖ్యానించాడు.
మరోవైపు గుకేశ్–డింగ్ లిరెన్ (చైనా) మధ్య జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్ వేస్తుందని ఏఐసీఎఫ్ కార్యదర్శి దేవ్ పటేల్ ప్రకటించారు. ఒకవేళ భారత్‌కు ఆతిథ్య హక్కులు లభిస్తే చెన్నై నగరం ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు వేదిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్యాండిడేట్స్ టోర్నీ టైటిల్ నెగ్గిన గుకేశ్‌కు ఏఐసీఎఫ్ రూ. 51 లక్షలు నగదు పురస్కారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment