Candidates Chess Tournament
-
గుకేశ్‌కు ఘనస్వాగతం
సాక్షి, చెన్నై: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ గురువారం టొరంటో నుంచి స్వస్థలం చెన్నై చేరుకున్నాడు. అతనికి చెన్నై విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. టోర్నీ సమయంలో గుకేశ్ వెంట తండ్రి రజినీకాంత్ ఉన్నారు. విమానాశ్రయంలో గుకేశ్ తల్లి పద్మ కుమారితోపాటు ఇతర కుటుంబ సభ్యులు, అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యులు గుకేశ్‌కు స్వాగతం పలికారు.‘టైటిల్ గెలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా కెరీర్‌ను తీర్చిదిద్దడంలో దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ పాత్ర ఎంతో ఉంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక ఈ ఏడాది చివర్లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగే ప్రపంచ చాంపియన్íÙప్ మ్యాచ్ కోసం సన్నద్ధమవుతాను’ అని వచ్చే నెలలో 18 ఏళ్లు పూర్తి చేసుకోనున్న గుకేశ్ వ్యాఖ్యానించాడు.మరోవైపు గుకేశ్–డింగ్ లిరెన్ (చైనా) మధ్య జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్ వేస్తుందని ఏఐసీఎఫ్ కార్యదర్శి దేవ్ పటేల్ ప్రకటించారు. ఒకవేళ భారత్‌కు ఆతిథ్య హక్కులు లభిస్తే చెన్నై నగరం ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు వేదిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్యాండిడేట్స్ టోర్నీ టైటిల్ నెగ్గిన గుకేశ్‌కు ఏఐసీఎఫ్ రూ. 51 లక్షలు నగదు పురస్కారం ప్రకటించింది. -
గుకేశ్ ‘భూకంపం’ తెచ్చాడు!
గ్యారీ కాస్పరోవ్ ప్రశంస టొరంటో: క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచి వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ పోరుకు అర్హత సాధించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌పై ‘ఆల్‌టైమ్ గ్రేట్’ గ్యారీ కాస్పరోవ్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ చెస్‌లో కొత్త మార్పునకు ఇది సూచన అని ఈ మాజీ వరల్డ్ చాంపియన్ అభిప్రాయపడ్డాడు. ‘గుకేశ్‌కు అభినందనలు. టొరంటోలో ఒక భారతీయుడు భూకంపం సృష్టించాడు. 17 ఏళ్ల కుర్రాడు చైనా చాంపియన్ డింగ్ లిరెన్‌ను ఢీకొనబోతుండటం ప్రపంచ చెస్‌లో ఆధిక్యం ఒక దిక్కు నుంచి మరో దిక్కుకు మారిందనేదానికి సరైన సూచిక. విశ్వనాథన్ ఆనంద్ ‘పిల్లలు’ అన్ని చోట్లా దూకుడు ప్రదర్శిస్తున్నారు. గుకేశ్ మరింత పైకి ఎదుగుతాడు. చైనా, భారత్‌కు చెందిన కుర్రాళ్లు చెస్‌లో ఏదైనా సాధించే సంకల్పంతో దూసుకుపోతుంటే ఇంగ్లండ్, అమెరికా జూనియర్ ఆటగాళ్లు మాత్రం చూస్తూనే ఉండిపోతున్నారు’ అని కాస్పరోవ్ వ్యాఖ్యానించాడు. ఆదివారం ముగిసిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఓపెన్ విభాగంలో భారత్ నుంచి గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతి పోటీపడ్డారు. గుకేశ్ విజేతగా అవతరించగా... ప్రజ్ఞానంద ఐదో స్థానంలో, విదిత్ ఆరో ర్యాంక్‌లో నిలిచారు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి రన్నరప్‌గా నిలువగా, వైశాలికి నాలుగో స్థానం లభించింది. -
సంయుక్తంగా అగ్రస్థానంలో గుకేశ్
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల గుకేశ్ 12వ రౌండ్ తర్వాత 7.5 పాయింట్లతో నకముర (అమెరికా), నిపోమ్‌నిషి (రష్యా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. 12వ రౌండ్లో గుకేశ్ 57 ఎత్తుల్లో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)ను ఓడించాడు. ఈ టోర్నీలో గుకేశ్‌కిది నాలుగో విజయం. భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద, విదిత్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నిపోమ్‌నిíÙతో జరిగిన గేమ్‌ను తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 55 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ 52 ఎత్తుల్లో కరువానా (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. నిర్ణీత 14 రౌండ్లు ముగిశాక అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్ ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌తో ప్రపంచ టైటిల్ కోసం పోటీపడతాడు. మరోవైపు మహిళల విభాగంలో భారత స్టార్ కోనేరు హంపి ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’ చేరింది. గొర్యాచ్కినా (రష్యా)తో జరిగిన 12వ రౌండ్ గేమ్‌ను హంపి 25 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ అనా ముజిచుక్‌తో జరిగిన గేమ్‌ను భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ వైశాలి 57 ఎత్తుల్లో నెగ్గింది. హంపి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో, వైశాలి 5.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. -
హంపి, వైశాలి విజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో పోటీపడుతున్న భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి 11వ రౌండ్లో విజయం సాధించారు. సలీమోవా నుర్గుయెల్ (బల్గేరియా)తో జరిగిన గేమ్‌లో హంపి 90 ఎత్తుల్లో... అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా)తో జరిగిన గేమ్‌లో వైశాలి 70 ఎత్తుల్లో గెలిచారు. ఈ టోర్నీలోకి హంపికిది రెండో విజయంకాగా, వైశాలి ఖాతాలో మూడో గెలుపు చేరింది. 11వ రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, వైశాలి 4.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఓపెన్ విభాగంలో 11వ రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్‌లకు ఓటమి ఎదురుకాగా, దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రజ్ఞానంద 54 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా) చేతిలో, విదిత్ 67 ఎత్తుల్లో నిపోమ్‌నిషి (రష్యా) చేతిలో పరాజయం పాలయ్యారు. గుకేశ్, కరువానా (అమెరికా) గేమ్ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. 11వ రౌండ్ తర్వాత గుకేశ్ 6.5 పాయింట్లతో రెండో స్థానంలో, ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో 5వ స్థానంలో, విదిత్ 5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. -
అగ్ర స్థానంలోనే గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టొరంటో: ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు డి.గుకేశ్ పది రౌండ్ల తర్వాత కూడా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గుకేశ్, నెపొమినియాచి (రష్యా) మధ్య జరిగిన పదో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. ఈ గేమ్ అనంతరం వీరిద్దరు కూడా చెరో 6 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. ఇతర గేమ్‌లలో ఫిరూజా అలీరెజా (ఫ్రాన్స్)పై ఫాబియానో కరునా (అమెరికా)... నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)పై హికారు నకమురా (అమెరికా) విజయం సాధించారు. ఇద్దరు భారత ఆటగాళ్లు విదిత్ గుజరాతీ, ప్రజ్ఞానంద మధ్య జరిగిన గేమ్ ‘డ్రా’ అయింది. ప్రజ్ఞానంద, నకమురా (5.5 పాయింట్లు) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కోనేరు హంపికి మరో ‘డ్రా’ ఎదురైంది. పదో గేమ్‌లో హంపి, జ్యోంగి తాన్ (చైనా) సమ ఉజ్జీలుగా నిలిచారు. అయితే మరో భారత ప్లేయర్ ఆర్.వైశాలి...సలిమోవా (బల్గేరియా)పై గెలుపొందింది. చైనాకు చెందిన లీ టింగ్జీ, జ్యోంగి తాన్ ప్రస్తుతం 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
Candidates Chess 2024: విదిత్ గుజరాతీ విజయం
టొరంటోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక క్యాండిడెట్స్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు విదిత్ గుజరాతీ మరో కీలక విజయాన్ని నమోదు చేశాడు. 9వ రౌండ్లో హికారు నకమురా (అమెరికా)ను విదిత్ ఓడించాడు. ఈ గెలుపుతో ఓవరాల్‌గా 4.5 పాయింట్లతో విదిత్...నకమురా, కరువానాలతో కలిసి నాలుగో స్థానంలో నిలిచారు. మరో వైపు ఇద్దరు భారత ఆటగాళ్లు డి.గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద మధ్య జరిగిన గేమ్ ‘డ్రా’గా ముగిసింది. తాజా ఫలితం తర్వాత గుకేశ్, నెపొమినియాచి 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 4 పాయింట్లతో ప్రజ్ఞానంద తర్వాతి స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 9వ రౌండ్ గేమ్ ‘డ్రా’ అయింది. హోరాహోరీ పోరు తర్వాత హంపి, రష్యాకు చెందిన కటెరినా లాగ్నో తమ గేమ్‌ను సమంగా ముగించారు. హంపికి మధ్యలో విజయావకాశాలు వచి్చనా కటెరినా తెలివిగా ఆడి తప్పించుకోలిగింది. అయితే మరో భారత ప్లేయర్ ఆర్.వైశాలి...చైనాకు చెందిన జోంగి తన్ చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం హంపి 4 పాయింట్లతో ముజిచుక్ (ఉక్రెయిన్)తో కలిసి ఐదో స్థానంలో కొనసాగుతోంది. -
ప్రజ్ఞానంద, విదిత్ విజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఆరో రౌండ్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతీ విజయాలు అందుకోగా... దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’ నమోదు చేశాడు. నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో జరిగిన గేమ్‌లో తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 45 ఎత్తుల్లో... అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్‌లో మహారాష్ట్రకు చెందిన విదిత్ 40 ఎత్తుల్లో గెలుపొందారు. హికారు నకముర (అమెరికా)తో జరిగిన గేమ్‌ను గుకేశ్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్ తర్వాత గుకేశ్ నాలుగు పాయింట్లతో నిపోమ్‌నిషితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. మహిళల విభాగం ఆరో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి ఓటమి పాలయ్యారు. హంపి 48 ఎత్తుల్లో లె టింగ్జీ (చైనా) చేతిలో... వైశాలి 29 ఎత్తుల్లో కాటరీనా లాగ్నో (రష్యా) చేతిలో ఓడిపోయారు. -
గుకేశ్‌కు రెండో విజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఐదో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్స్ అజేయంగా నిలిచారు. ఓపెన్ విభాగంలో తమిళనాడు కుర్రాడు దొమ్మరాజు గుకేశ్ ఈ టోరీ్నలో రెండో విజయాన్ని నమోదు చేయగా... ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతి తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరగా... తమిళనాడు అమ్మాయి వైశాలి కూడా తన గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. గుకేశ్ 87 ఎత్తుల్లో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)ను ఓడించగా... విదిత్–కరువానా (అమెరికా) గేమ్ 30 ఎత్తుల్లో... ప్రజ్ఞానంద–నెపోమ్నిషి (రష్యా) గేమ్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. హంపి–గొర్యాచ్కినా (రష్యా) గేమ్ 44 ఎత్తుల్లో... వైశాలి–అనా ముజిచుక్ (ఉక్రెయిన్) గేమ్ 49 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఐదో రౌండ్ తర్వాత ఓపెన్ విభాగంలో గుకేశ్ 3.5 పాయింట్లతో నిపోమ్‌నిషితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. 2.5 పాయింట్లతో ప్రజ్ఞానంద నాలుగో ర్యాంక్‌లో, 2 పాయింట్లతో విదిత్ ఆరో ర్యాంక్‌లో ఉన్నారు. -
Candidates Chess Tournament: హంపి పరాజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి తొలి పరాజయం ఎదురైంది. నాలుగో రౌండ్లో బల్గేరియా గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ 36వ ర్యాంకర్ న్యుర్గుల్ సలీమోవా 62 ఎత్తుల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపిపై సంచలన విజయం సాధించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఈ టోరీ్నలో రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండ్రా గొర్యాచ్కినా (రష్యా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను వైశాలి 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్ విభాగం నాలుగో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. విదిత్ సంతోష్ గుజరాతి 44 ఎత్తుల్లో నిపోమ్నియాషి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. నకముర (అమెరికా)తో గేమ్‌ను ప్రజ్ఞానంద 24 ఎత్తుల్లో...ఫాబియానో కరువానా (అమెరికా)తో గేమ్‌ను గుకేశ్ 74 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. -
విదిత్ గుజరాతీ సంచలన విజయం
టొరంటో: ప్రతిష్టాత్మక ‘ఫిడే’ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో రెండో రౌండ్లో నాలుగు గేమ్‌లలో కూడా ఫలితం వచ్చింది. భారత గ్రాండ్‌మాస్టర్ విది త్ గుజరాతీ...అమెరికాకు చెందిన వరల్డ్ నంబర్ 3 హికారు నకమురాపై 29 ఎత్తుల్లో సంచలన విజయం సాధించడం విశేషం. వరుసగా 47 గేమ్‌లలో ఓటమి లేకుండా కొనసాగిన నకమురా విజయయాత్రకు విదిత్ బ్రేక్ వేశాడు. భారత ఆటగాళ్ల మధ్య జరిగిన పోరులో డి.గుకేశ్ 33 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించాడు. ఇతర రెండో రౌండ్ గేమ్‌లలో ఇయాన్ నెపొనియాచి (రష్యా ) 45 ఎత్తుల్లో అలీ రెజా ఫిరోజా (ఫ్రాన్స్)పై విజయం సాధించగా...మరో గేమ్‌లో ఫాబియానో కరూనా (అమెరికా) 37 ఎత్తుల్లో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)పై గెలుపొందాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కోనేరు హంపి తన రెండో రౌండ్ గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. కటారినా లాగ్నో (ఉక్రెయిన్)తో ఈ గేమ్ 38 ఎత్తుల తర్వాత ముగిసింది. మరో గేమ్‌లో మ్యాచ్‌లలో చైనాకు చెందిన టాన్ జోంగీ చేతిలో భారత ప్లేయర్ వైశాలి ఓటమిపాలైంది. -
హంపి తొలి గేమ్ ‘డ్రా
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో ఐదుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి, ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్ తమ తొలి రౌండ్ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మహిళల విభాగంలో తమిళనాడు అమ్మాయి వైశాలితో జరిగిన తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ స్టార్ హంపి 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్ విభాగంలో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లో... విదిత్‌తో జరిగిన గేమ్‌ను గుకేశ్ 21 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఓపెన్ విభాగంలో ఎనిమిది మంది మధ్య... మహిళల విభాగంలో ఎనిమిది మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. రెండు విభాగాల విజేతలు ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం తలపడతారు. -
ప్రజ్ఞానంద, హంపిలపైనే దృష్టి
టొరంటో: ఓపెన్, మహిళల విభాగాల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్‌కు ప్రత్యర్థులను నిర్ణయించే క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి రంగం సిద్ధమైంది. టొరంటోలో నేడు మొదలయ్యే ఈ టోర్నీలో భారత్ నుంచి ఏకంగా ఐదుగురు గ్రాండ్‌మాస్టర్లు బరిలో ఉన్నారు. ఓపెన్ విభాగంలో ప్రజ్ఞానంద, గుకేశ్ (తమిళనాడు), విదిత్ (మహారాష్ట్ర)... మహిళల విభాగంలో కోనేరు హంపి (ఆంధ్రప్రదేశ్), ప్రజ్ఞానంద సోదరి వైశాలి (తమిళనాడు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భారత్ నుంచి ప్రజ్ఞానంద, హంపి ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. ఓపెన్ విభాగంలో 8 మంది... మహిళల విభాగంలో 8 మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మొత్తం 14 రౌండ్ల చొప్పున టోర్నీని నిర్వహిస్తారు. అత్యధిక పాయింట్లు గెలిచిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు. క్యాండిడేట్స్ టోర్నీ ఓపెన్ విభాగం విజేత ప్రస్తుత విశ్వవిజేత డింగ్ లిరెన్ (చైనా)తో... మహిళల విభాగం విజేత ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ టైటిల్ కోసం తలపడతారు. బుధవారం కేవలం ప్రారంభోత్సవం ఉంది. గురువారం తొలి రౌండ్ గేమ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీలో పోటీపడనున్న క్రీడాకారుల వివరాలు... ఓపెన్ విభాగం: ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్ (భారత్) , నెపోమ్నిషి (రష్యా), కరువానా, నకముర (అమెరికా), అబసోవ్ (అజర్బైజాన్), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్). మహిళల విభాగం: హంపి, వైశాలి (భారత్), టింగ్జీ లె, టాన్ జోంగి (చైనా), కాటరీనా లాగ్నో, గొర్యాక్చినా (రష్యా), సలీమోవా (బల్గేరియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్). -
చెస్‌కు చెక్!
మాస్కో: కరోనా విలయతాండవంలోనూ దానికి సంబంధం లేనట్లుగా జరుగుతున్న ఒకే ఒక్క పెద్ద క్రీడా ఈవెంట్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీ. ఇందులో విజేతగా నిలిచిన ఆటగాడు ప్రపంచ చెస్ టోర్నమెంట్లో నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో తలపడతాడు. అయితే ఇప్పుడు ఇది కూడా ఆగిపోయింది. రష్యాలో అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేయడంతో ఉన్నపళంగా టోర్నీని నిలిపివేయక తప్పలేదు. శుక్రవారం (ఈ నెల 27) నుంచి విమాన రాకపోకల్ని నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో టోర్నీని కొనసాగిస్తే... ఈవెంట్ ముగిశాక వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు స్వదేశం చేరే అవకాశాలు మూసుకుపోతాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఈవెంట్‌ను నిలిపివేసింది. ‘ఫిడే ఈ టోర్నమెంట్‌ను ఇలాగే కొనసాగిస్తే ఆటగాళ్లు, అధికారులు, ఇతరత్ర సిబ్బందిని నిర్ణీత గడువులోగా వారి స్వదేశాలకు పంపలేదు. ఈ నేపథ్యంలో ‘ఫిడే’ నిబంధనల మేరకు ఈవెంట్‌ను నిలిపివేయాలని నిర్ణయించాం’ అని ఫిడే అధ్యక్షుడు అర్కడి వొర్కవిచ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 7 రౌండ్లు జరిగాయి. మాక్సిమ్ వాచియెల్ (ఫ్రాన్స్), ఇయాన్ నెపొమ్నియాచి (రష్యా) 4.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నారు. తిరిగి మొదలైతే 8వ రౌండ్ నుంచి కొనసాగిస్తారు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ‘కోవిడ్–19’ వల్లే జర్మనీలో ఇరుక్కుపోయాడు. విదేశీ ప్రయాణ ఆంక్షలతో అక్కడే ఆగిపోయాడు. దీంతో అతను క్యాండిడేట్స్ చెస్‌కు ఆన్లైన్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. -
అజేయ ఆనంద్
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అజేయంగా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ 14 రౌండ్ల టోర్నీలో ఆనంద్ 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పీటర్ స్విద్లెర్ (రష్యా)తో జరిగిన చివరిదైన 14వ రౌండ్ గేమ్‌ను ఆనంద్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. చాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌కు 95 వేల యూరోలు (రూ. 78 లక్షల 28 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఎనిమిది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ 11 గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... మిగతా మూడు గేముల్లో గెలిచాడు. ఈ టైటిల్‌తో ఆనంద్ ఈ ఏడాది చివర్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీపడేందుకు అర్హత సాధించాడు. -
ఆనంద్ అదుర్స్
క్యాండిడేట్స్ టోర్నీ టైటిల్ సొంతం కార్ల్సన్తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు అర్హత ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. క్యాండిడేట్స్ టోర్నమెంట్లో మరో గేమ్ మిగిలి ఉండగానే విజేతగా నిలవడం ద్వారా మాగ్నస్ కార్ల్సన్తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. నవంబర్ 5 నుంచి 25 వరకు జరిగే ఈ పోటీకి త్వరలో వేదికను ప్రకటిస్తారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఆనంద్.. గత ఏడాది కార్ల్‌సన్‌కు టైటిల్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం కర్జాకిన్ (రష్యా)తో జరిగిన 13వ రౌండ్‌ను ఆనంద్ 91 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. మొత్తం 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేత అయ్యాడు. ఆంద్రికిన్ (రష్యా), క్రామ్నిక్ (రష్యా), కర్జాకిన్ (రష్యా), అరోనియన్ (అర్మేనియా), మమెదైరోవ్ (అజర్బైజాన్) 6.5 పాయింట్ల తో ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. -
ఆనంద్‌కు ఏడో ‘డ్రా’
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అజేయ రికార్డు కొనసాగుతోంది. మమైదైరోవ్ (అజర్బైజాన్)తో మంగళవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో ఆనంద్‌కిది ఏడో ‘డ్రా’ కావడం విశేషం. మరో మూడు గేముల్లో నెగ్గిన ఈ ప్రపంచ మాజీ చాంపియన్ పదో రౌండ్ తర్వాత 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతర గేముల్లో స్విద్లెర్ (రష్యా) 39 ఎత్తుల్లో క్రామ్నిక్ (రష్యా)ను ఓడిం చగా... అరోనియన్ (అర్మేనియా), తొపలోవ్ (బల్గేరియా) గేమ్ 45 ఎత్తుల్లో; కర్జాకిన్ (రష్యా), ఆంద్రికిన్ (రష్యా) గేమ్ 29 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. -
ఆనంద్ శుభారంభం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు. గురువారం మొదలైన ఈ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ ఆనంద్ 47 ఎత్తుల్లో లెవాన్ అరోనియన్ (అర్మేనియా)పై విజయం సాధించాడు. మొత్తం ఎనిమిది మంది అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో విజేతగా నిలిచిన క్రీడాకారుడు ఈ ఏడాది చివర్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో పోటీపడతాడు. శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో వాసిలిన్ తొపలోవ్‌తో ఆనంద్ ఆడతాడు.