హంపికి మరో ‘డ్రా’
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టొరంటో: ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు డి.గుకేశ్ పది రౌండ్ల తర్వాత కూడా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గుకేశ్, నెపొమినియాచి (రష్యా) మధ్య జరిగిన పదో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. ఈ గేమ్ అనంతరం వీరిద్దరు కూడా చెరో 6 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నారు.
ఇతర గేమ్‌లలో ఫిరూజా అలీరెజా (ఫ్రాన్స్)పై ఫాబియానో కరునా (అమెరికా)... నిజాత్ అబసోవ్ (అజర్‌బైజాన్)పై హికారు నకమురా (అమెరికా) విజయం సాధించారు. ఇద్దరు భారత ఆటగాళ్లు విదిత్ గుజరాతీ, ప్రజ్ఞానంద మధ్య జరిగిన గేమ్ ‘డ్రా’ అయింది. ప్రజ్ఞానంద, నకమురా (5.5 పాయింట్లు) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కోనేరు హంపికి మరో ‘డ్రా’ ఎదురైంది.
పదో గేమ్‌లో హంపి, జ్యోంగి తాన్ (చైనా) సమ ఉజ్జీలుగా నిలిచారు. అయితే మరో భారత ప్లేయర్ ఆర్.వైశాలి...సలిమోవా (బల్గేరియా)పై గెలుపొందింది. చైనాకు చెందిన లీ టింగ్‌జీ, జ్యోంగి తాన్ ప్రస్తుతం 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment