ICC Cricket World Cup 2023- Australia vs South Africa, 10th Match: వన్డే వరల్డ్‌కప్-2023లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభం నుంచే షాకుల మీద షాకులిచ్చింది సౌతాఫ్రికా. ప్రొటిస్ బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. ముఖ్యంగా పేసర్ కగిసో రబడ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన కంగారూ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది.
ఆరో ఓవర్ ఐదో బంతికి మిచెల్ మార్ష్(7)ను మార్కో జాన్సెన్ అవుట్ చేయడంతో మొదలైంది ఆసీస్ వికెట్ల పతనం. ఆ తర్వాత ఎంగిడి బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్(13), రబడ బౌలింగ్‌లో స్మిత్(19) ఎల్బీడబ్ల్యూ, జోష్ ఇంగ్లిస్‌ను బౌల్డ్ కాగా.. మహరాజ్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్(3) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
ఆ తర్వాత మళ్లీ రంగంలోకి దిగిన రబడ స్టొయినిస్(5)ను అవుట్ చేయడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి దశలో మార్నస్ లబుషేన్‌కు తోడుగా టెయిలెండర్ మిచెల్ స్టార్క్(51 బంతుల్లో 27 పరుగులు) పట్టుదలగా క్రీజులో నిలబడిన వేళ మార్కో జాన్సెన్ దెబ్బకొట్టాడు. ఆ వెంటనే 46 పరుగులతో నిలకడగా ఆడుతున్న లబుషేన్‌ను కేశవ్ మహరాజ్ పెవిలియన్‌కు పంపాడు.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, 41వ ఓవర్ మూడో బంతికి తబ్రేజ్ షంసీ బౌలింగ్‌లో కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను మిల్లర్ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒడిసిపట్టాడు. దీంతో షంసీ ఖాతాలో వరల్డ్‌కప్ క్రికెట్‌లో తొలి వికెట్ చేరింది.
అదే ఓవర్లో హాజిల్‌వుడ్‌ను కూడా షంసీ అవుట్ చేయడంతో ఆసీస్ కథ ముగిసిపోయింది. 177 పరుగులకే ఆలౌట్ కావడంతో సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 134 పరుగులు భారీ తేడాతో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ప్రొటిస్ పేసర్లలో రబడకు మూడు, జాన్సెన్‌కు రెండు, లుంగి ఎంగిడికి ఒక వికెట్ దక్కగా.. స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసీ చెరో రెండు వికెట్లు తీశారు.
డికాక్ సెంచరీతో..
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా గురువార నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. కంగారూ జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.
ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్వింటన్ డికాక్ వన్డే వరల్డ్‌కప్-2023లో వరుసగా రెండో శతకం(109) నమోదు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ ఎయిడెన్ మార్కరమ్ 56 పరుగులతో రాణించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. కాగా ఈ మెగా టోర్నీ తాజా ఎడిషన్‌లో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.తొలుత చెన్నైలో టీమిండియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment