ధోని చెప్పింది నిజమే కదా.. ఇప్పుడేమంటారు! | What Do You Say Critics Now, Netizens Suport Dhoni | Sakshi
Sakshi News home page

ధోని చెప్పింది నిజమే కదా.. ఇప్పుడేమంటారు!

Published Sat, Oct 24 2020 4:37 PM | Last Updated on Sat, Oct 24 2020 4:42 PM

What Do You Say Critics Now, Netizens Suport Dhoni - Sakshi

షార్జా:  ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 114 పరుగులకే పరిమితం కాగా, ముంబై ఇండియన్స్‌ 12.2 ఓవర్లలో దాన్ని ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌(68 నాటౌట్‌; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డీకాక్‌(46 నాటౌట్‌; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు వికెట్‌ పడకుండా ఛేదించారు. ఇది ముంబైకు ఏడో విజయం కాగా, సీఎస్‌కే ఎనిమిదో ఓటమి. దాంతో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి సీఎస్‌కే నిష్క్రమించింది.  సీఎస్‌కే జట్టులో ధోని(16), సామ్‌ కరాన్‌(52), శార్దూల్‌ ఠాకూర్‌(11)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. (‘కింగ్స్‌’ ఖేల్‌ ఖతమ్‌!)

ఇటీవల రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మాట్లాడుతూ.. యువ క్రికెటర్లలో స్పార్క్‌ లేదని, అందుకే వరుస పరాజయాల్ని చవిచూడాల్సి వస్తుందన్నాడు. దాంతో ఎంఎస్ ధోని నిర్ణయాలే జట్టు ఓటమికి కారణమని, ఫామ్‌లో లేని సీనియర్ ఆటగాళ్లకు పదే పదే అవకాశాలిచ్చి మూల్యం చెల్లించుకున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. యువ క్రికెటర్లలో కనిపించని స్పార్క్.. కేదార్ జాదవ్, పీయుష్ చావ్లాలో కనిపించిందా అని సోషల్ మీడియాలో ఎంఎస్ ధోనిపై మండిపడ్డారు. జట్టులో అందరూ  వెటరన్‌ క్రికెటర్లేనని, కుర్రాళ్లకు ఛాన్స్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు నువ్వు అవకాశం ఇవ్వాలి కదా.. అని మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ ఘాటుగా విమర్శించారు. ఈ విమర్శలనేపథ్యంలో శుక్రవారం రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సీనియర్లు కేదార్ జాదవ్, పీయుష్ చావ్లాను పక్కనపెట్టి .. యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌, ఎన్ జగదీశన్‌కు అవకాశం ఇచ్చాడు.

వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్‌, ఎన్ జగదీశన్‌ సద్వినియోగం చేసుకోలేకపోయారు. ముంబై స్టార్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్‌, జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతులకు అల్లాడిపోయారు. బౌల్ట్‌ వేసిన మొదటి ఓవర్లో రుతురాజ్ డకౌట్ అయితే.. బుమ్రా వేసిన రెండో ఓవర్లో జగదీశన్ డకౌట్ అయ్యాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న రుతురాజ్.. ఒక్క బాల్ కూడా ఆడాలనే ఉద్దేశంతో కనిపించలేదు. ఇక జగదీశన్ అయితే అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. గోల్డెన్ డకౌట్ అయ్యాడు. యువ క్రికెటర్లైన రుతురాజ్ గైక్వాడ్‌, ఎన్ జగదీశన్‌ ఘోరంగా విఫలమవడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్‌ను ఆటాడుకుంటున్నారు. బ్యాటింగ్‌ ఎలాగు రాదు.. కనీసం ఫీల్డింగ్‌ కూడా రాదా అంటూ విమర్శించాడు. నేరుగా వచ్చిన బంతిని కూడా అందుకోలేని అతనిలో స్పార్క్‌ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. యువ క్రికెటర్లలో స్పార్క్‌ లేదని ధోని చెప్పిన వ్యాఖ్య 100 శాతం కరెక్టే కదా.. ఇప్పుడేమంటారు అని పలువురు సీఎస్‌కే ఫ్యాన్స్‌ ధోనికి మద్దతుగా నిలుస్తున్నారు.. ఆ యువ క్రికెటర్లలో స్పార్క్‌ లేదనే విషయాన్ని గ్రహించే వారిని ఎక్కువ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేశాడని ధోనిని సమర్ధిస్తున్నారు. అయితే సరిగా ఆడలేని యువ క్రికెటర్లను ఎందుకు కొనుగోలు చేశారని మరొక వర్గం అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement