పోష్‌స్ట్రూమ్: తమ అజేయ రికార్డును కొనసాగిస్తూ భారత మహిళల హాకీ జట్టు తొమ్మిదేళ్ల తర్వాత జూనియర్ ప్రపంచకప్‌లో మరోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో దక్షిణ కొరియాపై ఘనవిజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలుచుకుంటూ వచ్చిన భారత జట్టు క్వార్టర్స్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఆరంభం నుంచే దాడులకు పదునుపెట్టిన అమ్మాయిలు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు.
ముంతాజ్ ఖాన్ (11వ ని.లో), లాల్‌రిండికి (15వ ని.లో), సంగీత (41వ ని.లో) ఒక్కో గోల్ చేసి జట్టును గెలిపించారు. 33 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు సెమీస్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో జర్మనీ ఆతిథ్యమిచ్చిన 2013 ప్రపంచకప్ టోర్నీలో భారత్ సెమీస్ చేరింది. అప్పుడు సెమీస్‌లో ఓడిన భారత జట్టు కాంస్య పతకపోరులో ఇంగ్లండ్‌ను 3–2తో పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి పతకం గెలుచుకుంది. 2016 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు అర్హత సాధించలేకపోయింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో మూడు సార్లు చాంపియన్ అయిన నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 5–0తో దక్షిణాఫ్రికాను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment