సూపర్‌ ఓవర్‌లో ఓటమి.. పెర్రీకి సారీ చెప్పిన మంధన | WPL 2025: Smriti Mandhana Emotional Apology To Ellyse Perry After Super Over Loss Against UP Warriorz, See Details | Sakshi
Sakshi News home page

WPL 2025: సూపర్‌ ఓవర్‌లో ఓటమి.. పెర్రీకి సారీ చెప్పిన మంధన

Published Wed, Feb 26 2025 7:35 PM | Last Updated on Thu, Feb 27 2025 12:56 PM

WPL 2025: Smriti Mandhana Emotional Apology To Ellyse Perry After Super Over Loss Against UP Warriorz

డబ్ల్యూపీఎల్‌-2025లో భాగంగా యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్‌ ఓవర్‌లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో ఇదే తొలి సూపర్‌ ఓవర్‌. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ ఎల్లిస్‌ పెర్రీ (56 బంతుల్లో 90 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. పెర్రీతో పాటు డానీ వ్యాట్‌ హాడ్జ్‌ (57) కూడా రాణించడంతో ఆర్సీబీ భారీ స్కోర్‌ చేయగలిగింది.

ఛేదనలో సోఫీ ఎక్లెస్టోన్‌ (19 బంతుల్లో 33; ఫోర్‌, 4 సిక్సర్లు) చెలరేగడంతో (ఇన్నింగ్స్‌ చివర్లో) ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఫలితంగా మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వారియర్జ్‌ 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. కిమ్‌ గార్త్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేసి వారియర్జ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. కేవలం 4 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. రెగ్యులర్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సత్తా చాటిన ఎక్లెస్టోన్‌ సూపర్‌ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఆర్సీబీని కట్టడి చేసింది. అద్భుతమైన టచ్‌లో ఉన్న పెర్రీని సూపర్‌ ఓవర్‌లో బరిలోకి దించకుండా స్మృతి మంధన పెద్ద తప్పు చేసింది. పెర్రీకి బదులు తనే బరిలోకి దిగడంతో సొంత అభిమానుల నుంచే ట్రోలింగ్‌ను ఎదుర్కొంది.

ఓటమి అనంతరం మంధన పెర్రీకి క్షమాపణలు చెప్పింది. అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన పెర్రీ కోసం మ్యాచ్ గెలవలేకపోయినందుకు బాధగా ఉందని అంది. జట్టు మొత్తం పెర్రీకి సారీ చెప్పాలని పేర్కొంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన‌ప్ప‌టికి ఇలాంటి ఫ‌లితం రావ‌డంతో బాధాకరమని చెప్పుకొచ్చింది. 

కాగా, ఈ మ్యాచ్‌లో పెర్రీ ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ఒంటిచేత్తో నిర్మించింది. గాయంతో బాధపడుతూనే విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడింది. బౌలింగ్‌లోనూ రాణించి ఓ వికెట్‌ తీసింది. పెర్రీ అద్భుత ప్రదర్శన కనబర్చినా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడటం నిజంగానే బాధాకరం. ఇదే మ్యాచ్‌లో పెర్రీ డబ్ల్యూపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక రన్‌ స్కోరర్‌గా అవతరించింది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ.. జట్టు నుంచి సహకారం లేకపోతే ఫలితాలు ఇలానే వస్తాయని అభిమానులు అంటున్నారు.

ఇదిలా ఉంటే, ఈ సీజన్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ అద్భుతంగా ప్రారంభించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మాంచి జోరును ప్రదర్శించింది. అయితే ఆతర్వాత వరుసగా రెండు ​మ్యాచ్‌ల్లో నిరాశపర్చింది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ నుంచి పెర్రీ అద్బుతంగా రాణిస్తుంది. ప్రస్తుతం ఆమెనే లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతుంది. పెర్రీ అద్భుత ప్రదర్శనల కారణంగానే ఈ సీజన్‌లో ఆర్సీబీ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. మంధన విఫలమవుతున్నా పెర్రీ ఆర్సీబీ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచింది.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement