డబ్ల్యూపీఎల్ చాంపియన్ ఆర్‌సీబీ
ఫైనల్లో ఢిల్లీపై ఘనవిజయం
శ్రేయాంక, మోలినెక్స్ మాయాజాలం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతోంది. మూడుసార్లు ఫైనల్లోకి వచ్చినా... మూడుసార్లూ తుదిపోరులో ఓడిపోయి టైటిల్‌ను అందుకోలేకపోయింది. ఇదే ఆర్‌సీబీ ఫ్రాంచైజీ గత ఏడాది మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అడుగు పెట్టింది. తొలి సీజన్‌లో నాలుగో స్థానంతో నిరాశపరిచింది.
అయితే ఏడాది తిరిగేలోపు బెంగళూరు మహిళల జట్టు అద్భుతం చేసింది. ఐపీఎల్‌లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్‌ను డబ్ల్యూపీఎల్‌లో మెరిపించే ఆటతీరుతో బెంగళూరు టైటిల్‌ను సొంతం చేసుకుంది. తమ ఫ్రాంచైజీకి డబ్ల్యూపీఎల్ టైటిల్ దక్కడంతో ఐపీఎల్ ఆర్‌సీబీ స్టార్స్ విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాజీ సభ్యులు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, మాజీ యాజమాని విజయ్ మాల్యా తదితరులు అభినందనలు తెలిపారు.
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్యూపీఎల్) రెండో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను మొదట స్పిన్‌తో కట్టడి చేసి... ఆ తర్వాత జాగ్రత్తగా లక్ష్యాన్ని ఛేదించేసి 8 వికెట్లతో బెంగళూరు గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లలో షఫాలీ వర్మ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేయగా... కెప్టెన్ మెగ్ లానింగ్ (23 బంతుల్లో 23; 3 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడింది.
తర్వాత ఇంకెవరూ 12 పరుగులకు మించి చేయలేకపోయారు. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్ (3.3–0–12–4), సోఫీ మోలినెక్స్ (3/20), ఆశ శోభన (2/14) ఢిల్లీని దెబ్బ కొట్టారు. అనంతరం బెంగళూరు 19.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 31; 3 ఫోర్లు), సోఫీ డివైన్ (27 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎలీస్ పెరీ (37 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు.
‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ పురస్కారం సోఫీ మోలినెక్స్‌కు దక్కింది. విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది. గత సీజన్ మాదిరిగానే ఈసారీ ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి, ఆ తర్వాత ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకోవడం గమనార్హం.
ధనాధన్... ఫటాఫట్!
ఢిల్లీ ఓపెనర్లు షఫాలీ వర్మ, మెగ్‌లానింగ్ ఆరంభంలో ధాటిగా చెలరేగిపోయారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో షఫాలీ భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. కెపె్టన్ లానింగ్ ఫోర్లతో వేగాన్ని పెంచింది. 6 ఓవర్లలో ఢిల్లీ 61/0 స్కోరు చేసింది. బ్యాటింగ్ పవర్‌ప్లే తర్వాత బౌలింగ్ పవర్‌ప్లే మొదలైనట్లుగా ఢిల్లీ వికెట్లు ఫటాఫట్ కూలాయి. 8వ ఓవర్ వేసిన స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ 4 బంతుల్లో 3 వికెట్లు తీసింది.
షఫాలీ, కీలకమైన వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (0), క్యాప్సీ (0) వికెట్లను సోఫీ పడగొట్టింది. 64 పరుగుల వద్దే ఈ మూడు వికెట్లు పడ్డాయి. 11వ ఓవర్ నుంచి శ్రేయాంక, ఆశ శోభన తిప్పేయడంతో లానింగ్, మరిజన్ కాప్ (8), జెస్ జొనాసెన్ (3), మిన్ను రాణి (5) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు.
రాధా యాదవ్ (12; 2 ఫోర్లు) బౌండరీలతో జట్టు స్కోరు 100 దాటాక... మోలినెక్స్ డైరెక్ట్ త్రోకు రాధ రనౌటైంది.19వ ఓవర్ వేసిన శ్రేయాంక రెండో బంతికి అరుంధతి రెడ్డిని (10), మూడో బంతికి తానియా (0)ను అవుట్ చేయడంతో క్యాపిటల్స్ ఆలౌటైంది. పవర్‌ప్లే తర్వాత ఢిల్లీకి ఏకంగా 47 బంతుల పాటు బౌండరీ గగనమైంది.
రాణించిన పెరీ, సోఫీ డివైన్
లక్ష్యం చిన్నదే అయినా... టైటిల్ పోరులో బెంగళూరు ఓపెనర్లు సోఫీ డివైన్, స్మృతి మంధాన అనవసర షాట్లకు వెళ్లకుండా జాగ్రత్తగా పరుగుల్ని రాబట్టారు. దీంతో 6 ఓవర్లలో బెంగళూరు 25/0 స్కోరే చేసింది. అడపాదడపా బౌండరీలతో వేగం పెంచిన సోఫీ డివైన్ జట్టు స్కోరు 49 పరుగుల వద్ద శిఖా పాండే బౌలింగ్‌లో అవుటైంది.
కెప్టెన్ స్మృతికి పెరీ జతవ్వగా ఈ జోడీ కూడా నింపాదిగానే పరుగుల్ని చక్కబెట్టింది. స్వభావానికి విరుద్ధంగా నెమ్మదిగా ఆడిన స్మృతికి మిన్ను మణి చెక్ పెట్టింది. అయితే అప్పటికే బెంగళూరు 82/2 స్కోరుకు చేరింది. మిగతా పరుగుల్ని పెరీ, రిచా ఘోష్ (17 నాటౌట్, 2 ఫోర్లు) పూర్తిచేయడంతో బెంగళూరు 3 బంతులు మిగిలుండగానే ట్రోఫీ గెలిచింది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రేయాంక 23; షఫాలీ వర్మ (సి) వేర్‌హమ్ (బి) సోఫీ మోలినెక్స్ 44; జెమీమా (బి) సోఫీ మోలినెక్స్ 0; క్యాప్సీ (బి) సోఫీ మోలినెక్స్ 0; మరిజన్ కాప్ (సి) సోఫీ డివైన్ (బి) ఆశ 8; జెస్ జొనాసెన్ (సి) స్మృతి (బి) ఆశ 3; రాధా యాదవ్ (రనౌట్) 12; మిన్ను మణి (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రేయాంక 5; అరుంధతి (బి) శ్రేయాంక 10, శిఖా పాండే (నాటౌట్) 5; తానియా భాటియా (సి) రిచా ఘోష్ (బి) శ్రేయాంక 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–64, 2–64, 3–64, 4–74, 5–80, 6–81, 7–87, 8–101, 9–113, 10–113.
బౌలింగ్: రేణుక సింగ్ 2–0–28–0, సోఫీ మోలినెక్స్ 4–0–20–3, ఎలీస్ పెరీ 2–0–14–0, సోఫీ డివైన్ 1–0–9–0, వేర్‌హమ్ 3–0–16–0, శ్రేయాంక పాటిల్ 3.3–0–12–4, ఆశ శోభన 3–0–14–2.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) అరుంధతి (బి) మిన్ను మణి 31; సోఫీ డివైన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శిఖా పాండే 32; ఎలీస్ పెరీ (నాటౌట్) 35; రిచా ఘోష్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (19.3 ఓవర్లలో 2 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–49, 2–82. బౌలింగ్: మరిజన్ కాప్ 4–0–20–0, క్యాప్సీ 3–0–13–0, శిఖా పాండే 4–0–11–1, రాధ 1–0–18–0, అరుంధతి 3.3–0–26–0, జొనాసెన్ 2–0–15–0, మిన్ను మణి 2–0–12–1.
Comments
Please login to add a commentAdd a comment