
డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించారని రుజువు కావడంతో జింబాబ్వే క్రికెట్ బోర్డు (ZC) ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లను సస్పెండ్ చేసింది. వెస్లీ మధేవెరె, బ్రాండన్ మవుటా బ్లడ్ శాంపిల్స్‌లో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు తేలడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మధేవెరె, మవుటాలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ZC ప్రకటించింది. విచారణ పూర్తయ్యే వరకు వీరిద్దరూ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనరని పేర్కొంది.
26 ఏళ్ల మవుటా ఇటీవలే ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించగా.. మధేవెరె గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. లెగ్ బ్రేక్ బౌలర్ అయిన మవుటా జింబాబ్వే తరఫున 4 టెస్ట్‌లు, 12 వన్డేలు, 10 టీ20లు ఆడి ఓవరాల్‌గా 26 వికెట్లు పడగొట్టాడు. మవుటా టెస్ట్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు.
మధేవెరె విషయానికొస్తే.. 23 ఏళ్ల ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జింబాబ్వే తరఫున 2 టెస్ట్‌లు, 36 వన్డేలు, 60 టీ20లు ఆడి 26 వికెట్లు, 1100 పైగా పరుగులు సాధించాడు. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న జింబాబ్వేకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి. ఇటీవలే ఆ జట్టు హెడ్ కోచ్ డేవ్ హటన్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. తాత్కాలిక హెడ్ కోచ్‌గా వాల్టర్ చాగుటా నియమితుడయ్యాడు.