పంట సేకరణ కేంద్రం
నెల్లూరు(సెంట్రల్) : ఉద్యాన పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోంది. వీటిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతులకు ఎలాంటి నష్టం రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉద్యాన పంటలను వేసిన రైతులతో ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రైతులు ఉద్యాన పంటలను సాగుచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది.
మొదటిసారిగా సంఘాల ఏర్పాటు
ఉద్యాన పంటలకు మంచి గిట్టుబాటు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘం పేరుతో ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసింది. ఒక్కో సంఘంలో 300 నుంచి 700 మందికి పైగా రైతులు ఉంటారు. జిల్లాలో ఉద్యాన పంటలకు సంబంధించి ఆయా పరిధిని బట్టి సంఘాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటికే 20 సంఘాలను ఏర్పాటు చేయగా వారితో ఉద్యానశాఖ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేస్తూ తగిన సూచనలు సలహాలు అందిస్తున్నారు.
సుదూర ప్రాంతాల్లో విక్రయాలు
జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు పంటలను కొనుగోలు చేస్తారు. వీటిని ప్రత్యేకంగా గ్రేడింగ్ చేసి సుదూర ప్రాంతాల్లో విక్రయాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. పంటలను నిల్వ చేసుకునేందుకు సేకరణ కేంద్రాలు, కోల్ట్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 20 సేకరణ కేంద్రాలు, 9 కోల్డ్‌రూములను ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఇప్పటికే 14 సేకరణ కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకురాగా, మిగిలిన నాలుగు నిర్మాణ దశలో ఉన్నాయి. నాలుగు కోల్డ్ రూముల నిర్మాణం పూర్తి కాగా మిగిలినవి కూడా త్వరలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోల్డ్ స్టోరేజ్ రూమ్
70 శాతం సబ్సిడీతో ఏర్పాటు
ఉద్యాన పంటల కోసం ఏర్పాటు చేస్తున్న కేంద్రాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ఇస్తోంది. ఒక్కో సేకరణ కేంద్రం ఏర్పాటుకు రూ.15 లక్షలు ఖర్చు కానుండగా అందులో రూ.11.25 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. అదే విధంగా ఒక్కో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు రూ.12.50 లక్షల ఖర్చు కానుండగా అందులో రూ.9.37 లక్షలకు ప్రభుత్వం రాయితీని ఇస్తోంది. వీటిని ఆయా సంఘాలు నడిపే విధంగా అటు రైతులకు మద్దతు ధరతో పాటు, ఇటు సంఘంలోని రైతులకు ఆదాయం వచ్చేలా సహాయ సహకారాలు అందిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలు వేసే రైతులు పంట సేకరణ కేంద్రాల ఏర్పాటుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment