
No Headline
ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
లెక్కలతో కుస్తీపడుతున్న నాయకులు
కోవూరు: ఎన్నికల సమరం ముగిసింది. ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. గెలుపుపై ఎవరి అంచనాలు వారికి, ఎవరి ధీమాలు వారికి ఉన్నాయి. అయితే గ్రామాల్లో ఎన్నికల వేడిమాత్రం ఇంకా తగ్గలేదు. నలుగురు గుమిగూడిన చోట ఫలితాలు, మెజార్టీలపైనే జోరుగా చర్చ సాగుతోంది. ఏ ఓటర్లు ఏ పార్టీకి మొగ్గుచూపుతున్నారన్న రచ్చబండ చర్చలు కొనసాగుతున్నాయి. అంతే కాకుండా సామాజిక వర్గాల ప్రకారం ఎవరు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపారన్న చర్చ కూడా నడుస్తోంది. పోల్ మేనేజ్‌మెంట్ ప్రభావం ఎంత, తమకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, గెలుపు ఏ విధంగా ఉండబోతోంది, ప్రత్యర్థికి బలహీనంగా మారిన పరిస్థితులు, తద్వారా గ్రామాల వారీగా మెజార్టీ వచ్చేందుకు ఏ పార్టీకి అవకాశం ఉందన్న లెక్కలు జోరుగానే వేస్తున్నారు. ఫంక్షన్లు, ఉత్సవాలు ఇలా సందర్భం ఏదైనా చర్చ మాత్రం ఎన్నికల ఫలితాల పైనే ఉంటోంది.
వివిధ అంశాలపై ఆరా
గ్రామాల వారీగా తమవైపు నిలబడే ఓటర్ల లెక్కలను గ్రామస్థాయి నాయకుల ద్వారా పోటీదారులు, వారి వర్గం వారు ఆరా తీస్తున్నారు. రాజకీయంగా చురుగ్గా ఉండే నాయకులకు స్థానికంగా లెక్కల మాట అటుంచితే, ఇతర ప్రాంతాల్లోని బంధువులు, స్నేహితుల నుంచి ఫోన్లు కూడా అధికంగా వస్తున్నాయి. తమ నియోజక వర్గాల్లో చర్చలకు తోడు కీలకంగా నిలిచే స్థానాల్లో ఫలితం ఏంటన్న అంశం కూడా ఈ చర్చల్లో ప్రధాన భూమిక పోషిస్తోంది. ఏది ఏమైనా ఫలితాలు వెలువడే వరకు ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయన్నది ఒప్పుకోవాల్సిందే.
సోషల్ మీడియా గప్‌చుప్
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓట ర్లను ఆకర్షించడం కోసం వీధుల్లోని గోడలపై పోస్టర్లు అతికించే ఆనవాయితీ నుంచి డిజిటల్ వేదికల్లో వినూత్న పంథాలో ప్రచారం చేసేంత వరకు రూపాంతరం చెందింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్ని నెలలుగా జిల్లా అంతటా జోరుగా ప్రచారం సాగింది. 13వ తేదీతో ఎన్నికల ముగియడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మూగబో యింది. వాట్సాప్ మెసేజ్‌లు, అభ్యర్థుల బ్రాడ్ కాస్టింగ్ కాల్స్, రీల్స్‌తో దద్దరిల్లిన సోషల్ మీడియా ప్రచారం ఎన్నికలు ముగి యగానే గప్‌చుప్ అయిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment