కోవూరు.. అల్లుడు జాగీరు | - | Sakshi
Sakshi News home page

కోవూరు.. అల్లుడు జాగీరు

Published Mon, Sep 30 2024 12:36 AM | Last Updated on Mon, Sep 30 2024 12:37 PM

-

వసూళ్లలో తగ్గేదే లేదంటున్న షాడో ఎమ్మెల్యే  

అవినీతికి కేరాఫ్‌గా మారిన కోవూరు 

ఇసుక నుంచి అభివృద్ధి పనులు  అన్నింటా అతనే 

ప్రతి పనికి 5 శాతం కమీషన్‌ డిమాండ్‌ 

గత ప్రభుత్వంలో మంజూరైన పనుల కాంట్రాక్టర్లనూ వదలని వైనం  

12 వేల టన్నుల ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నా.. చర్యలు నిల్‌ 

షాడో ఎమ్మెల్యే దోపిడీతో తమ్ముళ్ల బేజారు   

ఆయన నెల్లూరు ఎంపీ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి దంపతులకు బంధువు. వరసకు అల్లుడు. ప్రశాంతిరెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి నియోజకవర్గంలో తిష్టవేసి గిల్లుడు ప్రారంభించాడు. టీడీపీ అధికారంలోకి రావడం, ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో దోపిడీకి మాస్టర్‌ ప్లాన్‌ వేసుకున్నాడు. ఆమె ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి షాడో ఎమ్మెల్యేగా రంగ ప్రవేశం చేసి అక్రమాలకు తెర తీసినట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇసుకతో దోపిడీ ప్రారంభించిన షాడో ఎమ్మెల్యే ప్రతి పనికీ కమీషన్‌ ఫిక్స్‌ చేసి వసూళ్లకు పాల్పడుతున్నాడు. గత ప్రభుత్వంలో ఖరారైన పనులనూ వదలకపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. మొత్తంగా వంద రోజుల్లోనే కోవూరును అవినీతికి కేరాఫ్‌గా మార్చేశాడు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘అవినీతి రహిత పాలన, వివాదరహిత పాలనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. అందరూ సహకరించండి. ఇసుక, మట్టి, గ్రావెల్‌ దందాలు చేయొద్దు. గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పనులు ప్రతిపాదించండి తప్పక చేద్దాం’ ఇది కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తరచూ నియోజకవర్గ పర్యటనల్లో చెప్పే సూక్తులు. అయితే ఇవన్నీ గాలి మాటలని గడిచిన వంద రోజుల పాలనలోనే తేలిపోయింది. ఆ నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోంది. స్థానిక ఎమ్మెల్యే బంధువు షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతూ వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ప్రతి పనికి రేటు ఫిక్స్‌ చేసి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో మంజూరైన పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తుండడంతో లబోదిబోమంటున్నారు. మినగల్లు నుంచి ఇందుకూరుపేట వరకు పెన్నానదిలో అడుగడుగునా ఇసుక దోపిడీకి తెర తీశారు.

కమీషన్‌ ఇవ్వలేదని.. మైపాడు రోడ్డు పనులకు బ్రేక్‌
కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలంలో పర్యాటక ప్రదేశంగా ఉన్న మైపాడు బీచ్‌కు వెళ్లే రహదారి అభివృద్ధికి గత ప్రభుత్వంలో రూ.48 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆయా నిధులతో నెల్లూరు– మైపాడు వెళ్లే రహదారి 2/500 నుంచి 22/200 కిలో మీటర్ల వరకు రోడ్డు విస్తరణతో పాటు బీటీ రోడ్డు నిర్మాణానికి టెండర్లకు ఆహ్వానించారు. అప్పట్లో నెల్లూరుకు చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌ 4 శాతం లెస్‌తో టెండర్లు దక్కించుకున్నాడు. ఆ వర్క్‌కు సంబంధించి అగ్రిమెంట్‌ పూర్తయ్యే సరికి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో వర్క్‌ ప్రారంభించలేదు. 

ప్రస్తుతం వర్క్‌ ప్రారంభించేందుకు సిద్ధపడగా షాడో ఎమ్మెల్యే కూడా పెద్ద కాంట్రాక్టర్‌ కావడంతో వర్క్‌ ప్రారంభానికి ససేమిరా అన్నాడు. ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులను బెదిరించి ఆ వర్క్‌ సంబంధించి 5 శాతం కమీషన్‌ ఇవ్వాలని చెప్పించాడు. లేని పక్షంలో 60సీ ద్వారా కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌ చేసి తనకు అగ్రిమెంట్‌ చేసివ్వాలని ఒత్తిడి తేవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక వేళ రాజకీయ ఒత్తిళ్ల తలోగ్గి వర్క్‌ క్యాన్సిల్‌ చేస్తే సదరు కాంట్రాక్టర్‌ న్యాయ స్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. ఈ వివాదం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా షాడోకు అనుకూలంగానే పని చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

గత ప్రభుత్వంలో ప్రారంభమైన పనులనూ వదలని వైనం
షాడో ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ప్రారంభించి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను వదల్లేదు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం– దగదర్తి, రాజుపాళెం–ఇస్కపల్లి వరకు వెళ్లే రోడ్ల విస్తరణ పనులకు గత ప్రభుత్వంలోనే ఎన్‌డీబీ ద్వారా ఆయా వర్క్‌లకు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో పనులు ప్రారంభమైనా.. దశల వారీగా జరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం జిల్లా మొత్తంలోని పనులన్ని ఒకే ప్యాకేజీ ద్వారా టెండర్ల ప్రక్రియ జరిగింది. ప్రముఖ కాంట్రాక్టర్‌ ఆయా వర్కులకు సంబంధించి టెండర్‌ దక్కించుకుని సబ్‌ కాంట్రాక్టర్లకు పని అప్పగించారు. ఇప్పటికే ఆయా పనులు రోడ్డు వైండింగ్‌తో పాటు వంతెనలు నిర్మించారు. ఇక బీటీ రోడ్లు వేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయా రోడ్ల పనులను కొనసాగించాలంటే 5 శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనని షాడో ఎమ్మెల్యే సంబంధింత ఇంజినీరింగ్‌ అధికారుల ద్వారా ఒత్తిడి తేవడంతో సదరు సబ్‌ కాంట్రాక్టర్లు అడిగినంత ఇచ్చుకోకపోతే.. నష్టపోతామని ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

వీపీఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా చేసిన పనులకూ బిల్లులు
కోవూరు నియోజకవర్గంలోని వీపీఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా పంట కాలువలను అభివృద్ధి చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సొంతంగానే యంత్రాలు పంపించి కాలువలు బాగు చేయించారు. అయితే షాడో ఎమ్మెల్యే మాత్రం ఆయా పనులకు కూడా అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేసి బిల్లులు చేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇరిగేషన్‌ శాఖలో వివిధ రకాల పనుల కోసం రూ.80 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయించారని ప్రచారం జోరుగా సాగుతుంది.

గుట్టుచప్పుడు కాకుండా ఇసుక దోపిడీ
కోవూరులో షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న ఆయన టీడీపీ అధికారంలోకి వచ్చాక మినగల్లు ఇసుక డంపింగ్‌ యార్డు నుంచి 12 వేల టన్నుల ఇసుకను బహిరంగంగానే అక్రమ రవాణా సాగించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. డంపింగ్‌ యార్డు నుంచి ఇసుకను బిల్లులు లేకుండా అక్రమ రవాణా చేశారనే విషయం బయటపడడంతో మైనింగ్‌శాఖ అధికారులు డంపింగ్‌ను పరిశీలించి 12 వేల టన్నుల ఇసుక మాయమైన మాట వాస్తవేనని నిర్ధారించారు. విజిలెన్స్‌ అధికారుల ద్వారా విచారణ జరిపిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. అయితే విచారణ పర్వం కథ కంచికి చేరినట్లు తెలుస్తోంది. 

సదరు షాడో ఎమ్మెల్యే ప్రస్తుతం పెన్నానదిలో డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుక రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు షాడో వేసిన ఇసుక టెండర్‌ చెల్లుబాటు కాదని అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌ చేయాలని ఉత్తర్వులు ఇచ్చినా ఇరిగేషన్‌ అధికారులు మాత్రం కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి ఇసుక రవాణా సాగించడం విశేషం. బుచ్చిరెడ్డిపాళెం నుంచి కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట వరకు దాదాపు ఏడు చోట్ల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement