శభాష్.. డాక్టర్ పూర్ణిమ
చైన్నెలో క్షతగాత్రుడికి సేవలందించి ప్రాణాలు కాపాడిన గుడ్లూరు వైద్యురాలు
గుడ్లూరు: ‘వైద్యో నారాయణో హరిః’ అనే ఆర్యోక్తి చైన్నెలో రోడ్డు ప్రమాదం జరిగి గాయపడిన క్షతగాత్రుడికి గుడ్లూరు మండలం సాలిపేటకు చెందిన డాక్టర్ మునగాల పూర్ణిమ ఐశ్వర్య వైద్యం చేసి ప్రాణాన్ని కాపాడడంతో నిరూపితమైంది. పూర్ణిమ ఎంబీబీఎస్, ఎంఎస్ (జనరల్ సర్జన్), ఎంఆర్‌సీఎస్ (లండన్) చదివింది. ఈమెకు ఇటీవల లండన్‌లోని జేమ్స్ కుక్ మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో వైద్యురాలిగా ఉద్యోగం వచ్చింది. డిసెంబర్ 2వ తేదీన జాబ్‌లో చేరాలి. వీసా స్లాట్ కన్ఫర్మేషన్‌కు మంగళవారం సాయంత్రం 3 గంటలకు చైన్నెలో అపాయింట్‌మెంట్ ఉంది.
ఈ క్రమంలో ఆమె ఉదయం పినాకిని ఎక్స్‌ప్రెస్ రైల్లో వెళ్లి చైన్నె సెంట్రల్‌లో దిగి ఆటోలో వెళుతున్నారు. అదే సమయంలో అన్నాసాలై రోడ్డులో రద్దీగా ఉండే ఒక ఫ్లై ఓవర్‌పై స్కూటీపై నుంచి పడిన ఓ 25 ఏళ్ల యువకుడికి తల వెనుక భాగంలో తీవ్రగాయమైంది. రక్తం కారుతూ అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని వైద్యశాలకు తరలించేందుకు స్థానికులు ఎదురు చూస్తున్నారు. అక్కడే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ పోలీస్, మిలటరీ ఆఫీసర్లు ఉన్నారు.
అదే సమయంలో ఆటోలో వెళుతూ ఘటనను గమనించిన పూర్ణిమ ఐశ్వర్య అపస్మారక స్థితిలో పడి ఉన్న క్షతగాత్రుడికి ప్రాథమిక వైద్యం చేసి చలనంలోకి వచ్చి కళ్లు తెరచేలా చేశారు. అటుగా పోతున్న అంబులెన్స్‌ను ఆపి అతన్ని హాస్పిటల్‌లో చేర్చాలని పోలీస్ అధికారులకు అప్పగించారు. వైద్యురాలిగా స్పందించిన పూర్ణిమ ఐశ్వర్యను అందరూ అభినందించారు. ఆమె తండ్రి మునగాల గోవర్ధన్ గుడ్లూరు ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment