ఇదీ తీరు.. | - | Sakshi
Sakshi News home page

ఇదీ తీరు..

Dec 19 2024 7:54 AM | Updated on Dec 19 2024 7:54 AM

ఇదీ తీరు..

ఇదీ తీరు..

నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. పట్టణ ప్రణాళికలో అంతులేని అవినీతి, అక్రమ వసూళ్ల పర్వం రాజ్యమేలుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరుగుతున్నా, పట్టించుకునే పరిస్థితే కనిపించడం లేదు. అధికారులు కేవలం తమ జేబులు నింపుకొనే పనిలో నిమగ్నమై మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి ఆదేశాలా.. సారీ..!

సచివాలయ కార్యదర్శులు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కుమ్మకై ్క అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ కార్పొరేషన్‌ ఆదాయానికి గండి కొడుతున్నారంటూ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఆ విభాగంలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపి అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే ఇవేవీ తమకు పట్టదనే రీతిలో ఆ విభాగాధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనుమతులొకలా.. నిర్మాణాలు మరోలా

నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను ఓ రకంగా తీసుకొని క్షేత్రస్థాయిలో మరో తరహాలో పనులు చేస్తున్నారు. ఇరుకు రోడ్లలోనూ భారీ భవనాలను నిర్మిస్తున్నారు. సెట్‌ బ్యాక్‌ను వదలడంలే దు. అనుమతులను తుంగలో తొక్కి అదనపు అంతస్తులనూ నిర్మిస్తున్నారు. సదరు యజమానుల నుంచి టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు నగదు ముడితే అటువైపు కన్నెత్తి చూడటంలేదనే టాక్‌ నడుస్తోంది.

తనిఖీలా.. నో

నగరంలో భవన నిర్మాణాలపై నిఘా ఉంచాల్సిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నిద్రావస్థలో జోగుతున్నారు. ఎక్కడా తనిఖీలు చేపడుతున్న దాఖలాల్లేవు. దీంతో నిర్మాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వారి ఆదేశాల మేరకు నామమాత్రపు చర్యలు చేపట్టి, సదరు అక్రమ నిర్మాణదారుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం

పరిశీలించి చర్యలు చేపడతాం

డీసీపీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించా. భవన అక్రమ నిర్మాణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నా. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కడైనా నిర్మాణాలు జరుపుతున్నారని తెలిస్తే చర్యలు చేపడతాం. ప్లాన్‌ ప్రకారమే జరపాలి.

– పద్మజ, డిప్యూటీ సిటీ ప్లానర్‌,

నెల్లూరు కార్పొరేషన్‌

150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల నెల్లూరు నగరపాలక సంస్థలో 54 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 1,83,643 భవనాలున్నాయి. వీటిలో అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, షాపింగ్‌ మాళ్లు దాదాపు ఎనిమిది వేలకుపైగా.. బహుళ అంతస్తుల భవనాలు దాదాపు 25 వేలకుపైగా ఉన్నాయి. నెల్లో దాదాపు 20 భవనాలకు సంబంధించిన ప్లాన్‌ అప్రూవల్‌ దరఖాస్తులు కార్పొరేషన్‌కు వస్తుంటాయి. వీటిలో నిత్యం రెండు లేదా మూడు భవన నిర్మాణాలకు అనుమతులను మంజూరు చేస్తుంటారు. అయితే అనుమతుల ద్వారా కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం కంటే టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు అందే రాబడే ఎక్కువగా ఉంటోంది.

రాష్ట్రంలోని అతి పెద్ద నగరపాలక సంస్థల్లో ఒకటైన నెల్లూరు కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఇక్కడి టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో జరుగుతున్న తీరును చూస్తే విస్మయం కలగక మానదు. జోరుగా అక్రమ నిర్మాణాలు.. నిబంధనలు పాటించని భవన యజమానులు.. అనుమతుల్లేకుండా జరుగుతున్న కట్టడాలు.. ఇలా ఒక్కటేంటి.. ఎన్నెన్నో సిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారం యథేచ్ఛగా జరుగుతున్నా, చోద్యం చూడటం ఆ శాఖ అధికారులు, ప్లానింగ్‌ సెక్రటరీల వంతవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement