
మహిళ కుటుంబానికి చేయూత
నెల్లూరు(వీఆర్సీసెంటర్): గుండె, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతూ పూటగడవక ఇబ్బందులు పడుతున్న సుభాషిణి అనే మహిళకు దాతలు సాయం చేశారు. గురువారం సాక్షిలో ‘ఆమె జీవితం కష్టాలమయం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో 54వ డివిజన్ జనార్దనరెడ్డికాలనీ ప్రాంతానికి చెందిన మల్లికార్జున బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందజేశారు.
నకిలీ ఎస్సై అరెస్ట్
సంగం: మండలంలోని సంగంలో నకిలీ ఎస్సైగా చెలామణి అవుతున్న హరీష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంగం పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ వివరాలు వెల్లడించారు. హరీష్ నకిలీ ఎస్సై అవతారమెత్తి వాహనాలు ఆపి రికార్డులు పరిశీలిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కారు, నకిలీ యూనిఫాం, బెల్ట్, బూట్లు, నంబర్ ప్లేట్, టోపీ, స్టార్స్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. 2023లో వచ్చిన ఎస్సై ఫలితాల్లో ఎంపికయ్యానని సిద్ధీపురానికి చెందిన హరీష్ అందరినీ నమ్మించాడు. ఎస్సై యూనిఫాం ధరించి పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిపి నగదు వసూళ్లకు పాల్పడుతున్నాడని డీఎస్పీ వెల్లడించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. కేసును ఛేదించిన సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్, సిబ్బందిని అభినందించారు.
15 నుంచి అందుబాటులోకి
మ్యూజియం
నెల్లూరు రూరల్: నెల్లూరు సరస్వతి నగర్‌లో ఉన్న పురావస్తు శాఖ మ్యూజియం ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని సహాయ సంచాలకుడు జి.గంగాధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ శాఖ నిధులతో ఆధునికీకరణ పనులు చేపట్టినట్లు తెలియజేశారు. పురాతన వస్తువులు, రాజుల కాలం నాటి నాణేలు, అరుదైన శిల్పాలు ఉన్నాయన్నారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు
● ఒకరికి తీవ్రగాయాలు
దగదర్తి(బిట్రగుంట): దగదర్తి మండలం ఉలవపాళ్ల కూడలి వద్ద ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టిన ఘటన గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉలవపాళ్ల కూడలి వద్ద మలుపు తిరుగుతున్న ట్రాక్టర్‌ను ఒంగోలు నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ ఇంజిన్ రెండుగా విడిపోయింది. ట్రాక్టర్ విడిభాగాలు రోడ్డుపైన చెల్లాచెదురుగా పడిపోయాయి. డ్రైవర్ రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కారులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు చేపట్టారు.

మహిళ కుటుంబానికి చేయూత

మహిళ కుటుంబానికి చేయూత

మహిళ కుటుంబానికి చేయూత