
నేత్రపర్వం.. తెప్పోత్సవం
నేత్రపర్వంగా సాగుతున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం
బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం గురువారం భక్తజన సంద్రంగా మారింది. క్షేత్రవాసి ప్రసన్న వేంకటేశ్వరస్వామిని బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడవాహనసేవలో దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో బుధవారం సాయంత్రం నుంచే బిలకూట క్షేత్రం కిటకిటలాడింది. ఉత్సవాలు, ఆపద సమయాల్లో స్వామికి వరపడిన భక్తులంతా బ్రహ్మోత్సవాల్లో సమారాధనల పేరిట మొక్కుబడులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఉత్సవాలు, వాహన సేవల్లో అర్చకులు, ఆగమ పండితులు ప్రధాన పాత్ర పోషిస్తే మొక్కుబడుల రోజు మాత్రం భక్తులే నేరుగా స్వామిని కొలుస్తారు. సంప్రదాయానికి కొనసాగింపుగా జలదంకి, కావలి, అల్లూరు, దగదర్తి తదితర మండలాలకు చెందిన భక్తులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై అధిక సంఖ్యలో తరలివచ్చారు. గరుడవాహనంపై స్వావిని దర్శించుకుని, పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. భక్తితో తలనీలాలు సమర్పించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో, కొండదిగువన సామూహికంగా పొంగళ్లు పొంగించి భక్తితో ప్రసన్నునికి నివేదించారు. అనంతరం ఎవరికి వారు శక్తిమేర అన్నదానం చేశారు.
పుష్కరిణిలో జలవిహారం
ప్రసన్న వేంకటేశ్వరస్వామి గురువారం రాత్రి పుష్కరిణిలో జలవిహారం చేశారు. కలాణోత్సవానికి సిద్ధమయ్యే ప్రక్రియలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా పెండ్లికుమారుడైన స్వామివారు కొండపై కొలువుదీరగా అర్చకులు వైఖానస ఆగమోక్తంగా తెప్పోత్సవానికి సిద్ధం చేశారు. ఉభయదేవేరులను, స్వామిని కొండ దిగువన ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే వివిధ రకాల ఫుష్ఫాలు, పట్టుపీతాంబరాలతో సిద్ధం చేసిన తెప్పపై స్వామివారిని ఉభయదేవేరులతో కొలువుదీర్చి జలవిహారం చేశారు.
● తెప్పోత్సవం పూర్తి చేసుకున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామి గజవాహనంపై ఊరేగారు.
దర్శించి... తరించిన భక్తులు