
రెండిళ్లల్లో చోరీకి యత్నం
కోవూరు: నెల రోజులుగా ఇళ్లకు తాళాలు వేసి ఉన్న రెండిళ్లలో గుర్తు తెలియని దుండగలు గురువారం రాత్రి చోరీకి యత్నించారు. ఈ ఘటన స్థానిక ప్రభుత్వాస్పత్రి సమీపంలో జరిగింది. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు విశ్రాంత ఉపాధ్యాయుడు వరప్రసాద్, బ్రహ్మదేవి లక్ష్మి ఇళ్లు పక్క పక్కనే ఉంటాయి. వీరు నెల రోజుల క్రితం ఇళ్లకు తాళాలు వేసి విజయవాడ, హైదరాబాద్‌లో ఉంటున్న తమ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు గురువారం అర్ధరాత్రి తర్వాత ఆ రెండిళ్ల తాళాలు పగులకొట్టి బెడ్రూమ్‌లోకి చొరబడి గాలించారు. బీరువాలు, అల్మరాలు ప్రతి చోట వెతికి అక్కడ ఉన్న వస్తువులను చిందరవందరగా పడేశారు. అయితే వరప్రసాద్ ఇంట్లో మాత్రం రూ.5 వేలు నగదు చోరీకి గురైంది. పెద్ద మొత్తంలో నగదు, నగలు దొరకకపోవడంతో దుండగులు ఇళ్లల్లో ప్రతి చోటా గాలించినట్లు అక్కడ పడేసిన వస్తువులను బట్టి తెలుస్తోంది. దుండగులు ఇద్దరుగా గుర్తించారు. వీరు స్కూటీలో వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డుయింది. వీరు వెళ్తూ ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న మోటార్ బైక్ హ్యాండిల్ లాక్ పగులగొట్టి అపహరించుకుని పోయారు. ఈ మేరకు బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ట్రెయినీ డీఎస్పీ శివప్రియ పరిశీలన చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వేసవి కాలంలో ఆరుబయట, మిద్దెల మీద నిద్రపోయే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, బయట ఊర్లకు వెళ్లేవారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శివప్రియ తెలిపారు. ఆమె వెంట ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్, సిబ్బంది ఉన్నారు.