
ఈఓ నిర్లక్ష్యానికి పరాకాష్ట
బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బిలకూట క్షేత్రంలో కొలువైన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై భక్తులు భగ్గుమంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన రథోత్సవం ప్రారంభమైన వెంటనే నిలిచిపోవడం ఈఓ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అంటున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అరవ రాధాకృష్ణ, అతని సోదరుడు రాంబాబులు కొండపై తిష్టవేసి క్షేత్ర వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని మంటగలుపుతున్నారని పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం నిర్వహించే రథోత్సవం అధికారుల తప్పిదం కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. రథం చక్రాల వద్ద సమస్యలు తలెత్తి రథోత్సవం ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే రథం కదలకుండా నిలిచిపోవడంతో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. 2023లో రథోత్సవం సందర్భంగా రథం ఒక పక్కకు ఒరిగిపోవడం, ఈ దఫా అసలు కదలకపోవడంతో భక్తులు కలత చెందారు. ఫిట్‌నెస్ పరిశీలించకుండా, ట్రయల్ రన్ నిర్వహించకుండా రథాన్ని ఒకేసారి రథోత్సవానికి సిద్ధం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శిస్తున్నారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్వామివారి సేవల్లో వరుసగా ఆటంకాలు ఏర్పడుతున్నాయంటూ రథం వద్దే అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈఓ రాధాకృష్ణ డౌన్‌డౌన్, రాంబాబు డౌన్‌డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భక్తులకు, పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులకు సర్దిచెప్పి శాంతింపచేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పోలీసుల జోక్యంతో అప్పటికి భక్తులు శాంతించినా, ఈఓని మాత్రం తక్షణమే బదిలీ చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా పెత్తనమంతా కావలికి చెందిన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారని, కొండపై స్వామివారి సేవకన్నా ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీ ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు. వీఐపీ పాస్‌లు ఇష్టారాజ్యంగా కేటాయించడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శిస్తున్నారు. తక్షణమే ఈఓని బదిలీ చేసి రథోత్సవం వైఫల్యంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతా ఇష్టారాజ్యమే
బిలకూట క్షేత్రంలో రెండేళ్లుగా అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఈఓ సోదరుడు కొండపైనే తిష్టవేయడం, స్వామివారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకునే పేదలు, భక్తులు ఈఓ సోదరుడి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సి రావడంతో పాటు అంతా వ్యాపారంగా మారిపోవడంతో తరచుగా విమర్శలు వినిపిస్తున్నాయి. వీటితోపాటు బిలకూట క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, దాతల విరాళాలను కూడా గోప్యంగా ఉంచడం, బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఇదే నిర్లక్ష్యాన్ని, గోప్యతను పాటించడంపై పాత బిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఉత్సవాల్లో స్వామి వారిని తమ భుజాలపై మోసే మోతగాళ్లు కూడా ఈఓ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివాదం మరింత ముదిరి బిలకూట క్షేత్రం ప్రతిష్టకు మచ్చ రాకముందే అధికారులు ఈఓని బదిలీ చేసి ఆలయ వ్యవహారాలను చక్కదిద్దాలని కోరుతున్నారు.
రథోత్సవం నిలిచిపోవడంపై
భగ్గుమంటున్న భక్తులు
ఈఓ, అతని సోదరుడికి
వ్యతిరేకంగా నినాదాలు
ఈఓని బదిలీ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్