గిరిజనులకు న్యాయం చేస్తాం
● సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ
ఉలవపాడు: గిరిజనులకు సాగుబడి హక్కులు కల్పి ంచడంలో చట్టప్రకారం న్యాయం చేస్తామని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వీరేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. భూములపై గిరిజనులకు సాగుబడి హక్కు కల్పించడానికి అటవీ శాఖ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2005 గిరిజన చట్టానికి ముందు నుంచి అటవీ భూములు సాగు చేసుకుంటున్నారా? లేక తర్వాత చేపట్టారా? అని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పంటలు వేస్తున్నారని వారిని అడిగారు. వీరేపల్లి పరిధిలో 74 మందిని అర్హులుగా గుర్తించినట్లు ఆమెకు రెవెన్యూ సిబ్బంది తెలియజేశారు. మిగిలిన వారు తమ సాగుబడి గురించి ఆమెకు వినతిపత్రాలు అందించారు. వీరేపల్లి చెరువులో నీరు తాగి గొర్రెలు చనిపోయాయని కొందరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, తాగునీటికి పనికిరావని దండోరా వేశారని గ్రామ మాజీ సర్పంచ్ నన్నం పోతురాజు సబ్‌కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమగ్ర విచారణ చేయించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఐటీడీఏ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.