నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో అదిగో అభివృద్ధి.. ఇదిగో అభివృద్ధి అంటూ అధికార పార్టీ నాయకులు ఆర్భాటంగా చెబుతున్నారు. కానీ 2025 – 26 బడ్జెట్‌ను చూస్తే అంకెల గారడీ తప్ప ఇంకేం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.695.95 కోట్ల బడ్జెట్ గాలి లెక్కలేనంటూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు నిలదీయగా.. టీడీపీకి చెందిన కొందరు కూడా అధికారులను ప్రశ్నించారు. ఇరువర్గాలు ప్రశ్నల వర్షం కురిపించగా అధికారులు లెక్కలను పూర్తి స్థాయిలో వివరించడంలో విఫలమయ్యారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నగరపాలక సంస్థలో ఈ పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశమైంది.
అడ్డుపడుతూ..
కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశం మొదలైంది. మొత్తం బడ్జెట్‌ను రూ.695.95 కోట్లతో రూపొందించగా, ప్రణాళికా వ్యయం రూ.448.52 కోట్లు ఉండగా, ప్రణాళికేతర వ్యయం రూ.247.43 కోట్లుగా ఉంది. సమావేశం ప్రారంభమయ్యాక వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, వేలూరు మహేష్, మొయిళ్ల గౌరీలు ప్రజా సమస్యలపై మాట్లాడే క్రమంలో కొందరు టీడీపీ కార్పొరేటర్లు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
ఉడాయించిన టీడీపీ కార్పొరేటర్లు
సమావేశం ప్రారంభమయ్యాక 12 గంటలకు పదిమందికి పైగా టీడీపీ కార్పొరేటర్లు ఉడాయించారు. తమ డివిజన్లలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వారికి ఓపిక లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. జనసేన నేత, కో–ఆప్షన్ సభ్యుడు నూనె మల్లికార్జున్ యాదవ్ సమావేశానికి ఆలస్యంగా వచ్చి కేవలం పదినిమిషాలు మాత్రమే ఉండి అరుపులు, కేకలతో కొంతసేపు హడావుడి చేసి నెమ్మదిగా జారుకున్నారు. కొందరు ఆయన తీరుపై విస్మయం వ్యక్తం చేశారు.
జెరాక్స్‌కు అంత మొత్తమా..
2024 – 25 సంవత్సరానికి కార్పొరేషన్‌లో స్టేషనరీ కోసం రూ.రూ.40 లక్షలు ఖర్చు చేసినట్లు బడ్జెట్ లెక్కలు చూపడంపై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు నిలదీశారు. అంత ఎందుకు అవుతుందని అడగ్గా అధికారులు నీళ్లు నమిలారు. అదేవిధంగా జెరాక్స్ కోసం రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కార్పొరేషన్‌లో జెరాక్స్ మెషీన్లు లేవని, బయట తీసుకుంటున్నామని చెప్పారు. దీంతో కార్పొరేటర్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతుంటే కనీసం జెరాక్స్ మెషీన్లు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారా అని నిలదీశారు. బడ్జెట్‌లో మేయర్ పేషీకి 2023 – 24లో రూ.2,50,000 ఖర్చు చేసినట్లు చూపారు. 2024 – 25కు వచ్చేసరికి ఆ మొత్తం రూ.8 లక్షలకు పెరిగిందని, అంతలా దేనికి ఖర్చు చేశారని టీడీపీ కార్పొరేటర్ కర్తం ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. దీని విషయంలో అధికారులు లెక్కలు చెప్పడంలో తడబడ్డారు. కాగా కర్తం మాట్లాడుతూ తన డివిజన్‌లో తాగునీటి సమస్య ఉందన్నారు. నగర ప్రజలకు సక్రమంగా తాగునీరు అందించలేకపోతున్న ఇంజినీరింగ్ శాఖపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డు ప్రదర్శించారు.
వారు సైతం..
టీడీపీ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి మాట్లాడుతూ పన్ను వసూళ్లలో అధికారుల తీరు బాగోలేదని, దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పుకొచ్చారు. కార్పొరేటర్ రామకృష్ణ మాట్లాడుతూ వీధిలైట్లు వెలగలేదని ఏఈకి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కర్తం ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ పన్ను చెల్లించకపోతే కరెంట్, వాటర్ కట్ చేస్తామని ఉద్యోగులు ప్రజలను బెదిరిస్తున్నట్లు తెలిపారు. మేయర్ పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ పన్ను వసూళ్లలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వివిధ అంశాలపై చర్చించిన అనంతరం బడ్జెట్‌ను ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో కమిషనర్ సూర్యతేజ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
అధికారుల తీరు మారాలి
ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. డివిజన్లలో జరిగే అభివృద్ధి పనులను సైతం కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావడం లేదు. అధికారులు తీరు మార్చుకోవాల్సి ఉంది. అదేవిధంగా బడ్జెట్ మొత్తం ఊహాజనితంగా ఉంది. సరైన లెక్కలు చూపలేదు. డిపార్ట్‌మెంట్ నుంచి కచ్చితమైన లెక్కల్లేవు. గతేడాదితో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ చూపారు. అవినీతి జరిగే అవకాశం ఉంది.
– బొబ్బల శ్రీనివాస్ యాదవ్,
కార్పొరేటర్
ట్రాఫిక్ సిగ్నల్స్
పనిచేయడం లేదు
నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గతేడాది రూ.70 లక్షలు ఖర్చుచేసినట్లు చూపారు. రానున్న రోజుల్లో రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపారు. నగరంలో ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. బడ్జెట్‌లో మాత్రం అంకెల గారడీ చూపారు. 46వ డివిజన్‌లో ఓ సచివాలయంలో ప్రింటర్ చెడిపోయి మూడు నెలలు గడస్తున్నా పట్టించుకోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– వేలూరు మహేష్, కార్పొరేటర్
చిరు వ్యాపారులపై భారం
రెవెన్యూ అధికారులు చిరు వ్యాపారులపై కమర్షియల్ ట్యాక్స్ పేరుతో భారం మోపుతున్నారు. డిమాండ్ నోటీసులు కూడా ఇవ్వకుండా పన్నులు చెల్లించాలని ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. బోర్డుల్లేని వ్యాపారులు కూడా ట్రేడ్ లైసెన్స్ కట్టాలని అధికారులు భారం మోపుతున్నారు.
– మొయిళ్ల గౌరీ, కార్పొరేటర్
చర్యలు తీసుకోవాలి
మందుల కొనుగోళ్లకు గత సంవత్సరం రూ.5 లక్షలు ఖర్చు చేశారు. రానున్న ఏడాదిలో రూ.15 లక్షల ఖర్చు చేస్తామని చూపించారు. పారిశుద్ధ్య కార్మికులకు మందులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలి
– సత్తార్, కార్పొరేటర్
రూ.695.95 కోట్లతో
2025 – 26 కార్పొరేషన్ బడ్జెట్
తప్పుడు లెక్కలు చూపారని
వైఎస్సార్‌సీపీ నిలదీత
అధికార పార్టీ కార్పొరేటర్ల నుంచీ ప్రశ్నల వర్షం
నీళ్లు నమిలిన కొందరు అధికారులు
మధ్యలో వెళ్లిపోయిన కొందరు
టీడీపీ కార్పొరేటర్లు
అంతా గాలి లెక్కలే..
అంతా గాలి లెక్కలే..
అంతా గాలి లెక్కలే..
అంతా గాలి లెక్కలే..


