నెల్లూరు (పొగతోట): మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాకాణిని ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆయన నివాసం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. మరో వైపు జిల్లా వ్యాప్తంగా ముఖ్య నేతలు సైతం ఆయన నివాసానికి చేరుకుని జరగబోయే పరిణామాలపై చర్చిస్తున్నారు. మరో వైపు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సైతం ఆయన నివాసం, పార్టీ జిల్లా కార్యాలయం వద్దనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారుల సమాచారాన్ని అందిస్తున్నారు. పొదలకూరు మండలం తాడిపత్రి సమీపంలో రుస్తుం మైన్‌లో లీజు ముగిసినా అక్రమంగా రూ.250 కోట్ల తెల్ల రాయిని దోచేశారంటూ మైనింగ్‌పై పచ్చమీడియా కల్పిత కథనాలు వండి వారుస్తోంది. మరో వైపు మైనింగ్ శాఖాధికారులు సుమారు 60 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ అక్రమంగా తరలిపోయినట్లు పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో పది మందిపై కేసు పెట్టారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏ–4 గా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ రిమాండ్ రిపోర్టులో రూ.7 కోట్లుగా చూపించారు. ఈ క్రమంలో కాకాణిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారంటూ రెండు రోజుల నుంచి విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. దీంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని కాకాణి అనుచరులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఇంటి వద్ద భారీ సంఖ్యలో చేరుకున్నారు. నాయకులు, కార్యకర్తలు రాత్రి నుంచి కాకాణి నివాసం వద్దే ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం విజయ్ కుమార్‌రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీ కాకాణితో సమావేశమయ్యారు. పెద్ద ఎత్తున అనుచరులు, నాయకులు, కార్యకర్తలు ఉండడంతో పోలీసులు కాకాణిని అరెస్ట్ చేసేందుకు వెళితే గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకాణికి సంఘీభావంగా మరికొంత మంది నాయకులు ఆయన నివాసానికి చేరుకుని ఆయనతో చర్చించారు. నెల్లూరులో ఏ క్షణం ఏం జరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు
భారీగా చేరుకున్న నేతలు, కార్యకర్తలు
ముఖ్య నేతలతో భేటీ
ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వర్గాల నిఘా
కాకాణి ఇంటి వద్ద హైటెన్షన్


