ఉదయగిరి: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు ముదిరాయి. తమ్ముళ్లు ఏకంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలోనే తన్నులాడుకున్నారు. స్థానిక మండ పరిషత్ కార్యాలయం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి బుధవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వచ్చారు. ఈ సమయంలో టీడీపీ మండల నేత మట్ల లక్ష్మయ్య కోడలైన ఎంపీపీ మట్ల శాంతి కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో మీడియా ఫొటోలు తీసుకునే సమయంలో మాజీ జెడ్పీ చైర్మన్ చెంచలబాబుయాదవ్ మట్ల శాంతి పక్కన ఎమ్మెల్యే వద్ద నిలబడ్డాడు. దీంతో శాంతి వెనక్కి జరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో మట్ల లక్ష్మయ్య చెంచలబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడారు. చెంచలబాబు, పార్టీ మండల కన్వీనర్ బయ్యన్న, మైనార్టీ నేత రియాజ్ లక్ష్మయ్యపై ఘాటుగా స్పందించారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని లక్ష్మయ్యను పక్కకు లాకెళ్లారు. ఆయన పోలీసులను పక్కకు నెట్టేశారు. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ లక్ష్మయ్యకు సర్ది చెప్పి మండల సమావేశానికి బయలు దేరారు. ఈ క్రమంలో లక్ష్మయ్య రెచ్చగొట్టే విధంగా మాట్లాడంతో సీఐ సీరియస్ కావడంతో పరిస్థితి సద్దుమణిగింది. సాయంత్రం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించే క్రమంలో ఉదయం జరిగిన ఘటన వ్యవహారంపై మరోసారి చెలరేగింది. దీంతో మట్ల లక్ష్మయ్య, చెంచలబాబు వర్గీయులకు మధ్య గొడవ జరిగింది. లక్ష్మయ్యపై మరో టీడీపీ నేత నల్లిపోగు రాజా చేయికున్నారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోవడంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని లక్ష్మయ్య బ్రదర్స్‌తో మాట్లాడి సర్దుబాటు చేశారు.


