జిల్లా జైల్లో న్యాయ విజ్ఞాన సదస్సు | - | Sakshi
Sakshi News home page

జిల్లా జైల్లో న్యాయ విజ్ఞాన సదస్సు

Mar 28 2025 12:09 AM | Updated on Mar 28 2025 12:09 AM

జిల్లా జైల్లో  న్యాయ విజ్ఞాన సదస్సు

జిల్లా జైల్లో న్యాయ విజ్ఞాన సదస్సు

వెంకటాచలం: మండలంలోని చెముడుగుంట సమీపంలో ఉన్న జిల్లా జైల్లో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.వాణి విచ్చేసి ఖైదీల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భోజన వసతి, వైద్య సదుపాయాల గురించి ఆరాతీశారు. లాయర్‌ లేనివారికి ఉచితంగా ఆ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా జైల్లో పారా లీగల్‌ వలంటీర్‌ను నియమించడం జరిగిందని, వారి ద్వారా సమస్యలపై అర్జీలు సమర్పిస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

‘మీరు దగ్గరుంటే ఈత రాదు’

కుమార్తెకు స్విమ్మింగ్‌ నేర్పించేందుకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు

వారిని పంపించేసిన నిర్వాహకులు

స్విమ్మింగ్‌పూల్లో బాలిక మృతి

ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఘటన

నెల్లూరు(క్రైమ్‌): స్విమ్మింగ్‌పూల్‌ నిర్వహణలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈత నేర్చుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలిక మృతిచెందిన ఘటన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జీవీఆర్‌ఆర్‌ కళాశాల సమీపంలోని సప్తగిరి లేఅవుట్‌లో వంశీకృష్ణ, ఆదిలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె, కుమారుడున్నారు. కుమార్తె మనస్వి (9) వెంకటాచలంలోని ఓ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. బాలికకు ఈత నేర్పించేందుకు తల్లిదండ్రులు బుధవారం స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఫీజు చెల్లించారు. గురువారం సాయంత్రం మనస్విని స్విమ్మింగ్‌పూల్‌ వద్దకు తీసుకెళ్లారు. మీరు దగ్గరుంటే నేర్చుకోలేరని సిబ్బంది తల్లిదండ్రులను పంపివేశారు. ఈ క్రమంలో స్విమ్మింగ్‌పూల్లో ఏమైందో తెలియదు గానీ సాయంత్రం 6.30 గంటలకు సిబ్బంది మనస్వి తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు. ఈత నేర్చుకుంటుండగా బాలికకు ఫిట్స్‌ వచ్చాయని, శ్వాస తీసుకోలేకపోవడంతో బొల్లినేని ఆస్పత్రికి తీసుకెళుతున్నామని చెప్పారు. వంశీకృష్ణ, ఆదిలక్ష్మి వెంటనే ఆస్పత్రికి వెళ్లేసరికి కుమార్తె మృతిచెంది ఉంది. సిబ్బంది నిర్లక్ష్యం, పూల్‌ వద్ద సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తమ కుమార్తె మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు వారు దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్ర కమిటీల్లో

జిల్లా నేతలకు చోటు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన నేతలకు రాష్ట్ర అనుబంధ విభాగాల్లో చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు విభాగం అఫిషియల్‌ స్పోక్స్‌పర్సన్‌గా బట్టేపాటి నరేంద్రరెడ్డి, సెక్రటరీగా దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీలుగా కర్తం శ్రీనివాసులురెడ్డి, కర్తం సురేంద్రరెడ్డి, ఎస్సీ సెల్‌ సెక్రటరీగా కొండా వెంకటేశ్వర్లు, జాయింట్‌ సెక్రటరీలుగా స్వర్ణా వెంకయ్య, కుందుర్తి శ్రీనివాసులు, బద్దేపూడి రవీంద్ర, మందా రవికుమార్‌, వలంటీర్స్‌ వింగ్‌ జనరల్‌ సెక్రటరీగా కుంచాల సవీంద్రరెడ్డి, సెక్రటరీగా పీర్ల పార్థసారథి, జాయింట్‌ సెక్రటరీగా ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, బూత్‌ కమిటీల వింగ్‌ జనరల్‌ సెక్రటరీగా యనమాల భగవాన్‌, జాయింట్‌ సెక్రటరీలుగా ఎ.రాజశేఖరరెడ్డి, గణేషం గంగిరెడ్డి, మొలకల శ్రీనివాసులురెడ్డి, సోషల్‌ మీడియా వింగ్‌ సెక్రటరీగా మహ్మద్‌ రవూఫ్‌, వీవర్స్‌ వింగ్‌ జనరల్‌ సెక్రటరీగా కోనం బ్రహ్మయ్య, జాయింట్‌ సెక్రటరీగా చేబ్రోలు జనార్దన్‌లు నియమితులయ్యారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి మృతి

సోమశిల: అనంతసాగరం మండలం చిలకలమర్రి సమీపంలో పాతాళపల్లి వద్ద జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. అనంతసాగరానికి చెందిన షేక్‌ ఇబ్రహీం కుమారుడు షేక్‌ హమీద్‌ (29) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గురువారం పని నిమిత్తం అనంతసాగరం నుంచి గోవిందంపల్లికి బైక్‌పై వెళ్తున్నాడు. యాకర్లపాడు నుంచి యోహాన్‌ అనే వ్యక్తి కలువాయికి బైక్‌పై వెళ్తున్నాడు. పాతాళపల్లి వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తలకు గాయమై హమీద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. యోహాన్‌ గాయపడగా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని సోమశిల పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

52 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

నెల్లూరు రూరల్‌: జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 52 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లుగా జేసీ కె.కార్తీక్‌ తెలిపారు. గురువారం 3,088 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటన విడుదల చేశారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.75 సన్నవి : రూ.60

పండ్లు : రూ.35

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement