చాపకింద నీరులా క్రికెట్ బెట్టింగ్
నెల్లూరు(క్రైమ్): ‘ఐపీఎల్ ప్రారంభం కావడంతో జిల్లాలో బెట్టింగ్ మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ విష వలయంలో చిక్కుకుని యువత జీవితాలను నాశనం చేసుకుంటోంది. బెట్టింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. గురువారం యువజన, విద్యార్థి విభాగాల నేతలు నగర డీఎస్పీ పి.సింధుప్రియను నెల్లూరులోని కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ బెట్టింగ్ కారణంగా అనేకమంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునేందుకు వెనుకాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ మాఫియాను కట్టడి చేసేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. పోలీస్ అధికారులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మాఫియా, బెట్టింగ్ యాప్‌లు, వాట్సాప్ గ్రూప్‌లపై నిఘా పెంచాలన్నారు. నష్టాలను తెలియజేసేలా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ముంగమూరు ఆశ్రిత్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో లాడ్జీలు, హోటల్స్, గెస్ట్‌ఇన్‌లలో బెట్టింగ్ జోరుగా సాగుతోందన్నారు. సులభంగా నగదు సంపాదించవచ్చని నిర్వాహకులు యువత, విద్యార్థులకు ఆశచూపి బెట్టింగ్ ఊబిలో దించుతున్నారన్నారు. బానిసైన అనేకమంది బయటకు రాలేక నష్టాలను భర్తీ చేసుకోవడానికి, అప్పులు తీర్చుకునేందుకు నేరాలకు పాల్పడుతూ భవిష్యత్‌ను అంథకారం చేసుకుంటున్నారన్నారు. స్పందించిన డీఎస్పీ క్రికెట్ బెట్టింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు గుర్తిస్తే డయల్ 112, 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
చర్యలు తీసుకోవాలి
డీఎస్పీకి వైఎస్సార్‌సీపీ యువజన,
విద్యార్థి విభాగాల వినతి


