కందుకూరు: ఓ యువకుడు బాడీ బిల్డింగ్ పోటీల్లో విశేషంగా రాణిస్తున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొంటూ మిస్టర్ ఆసియా టైటిల్ అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. కందుకూరు పట్టణంలోని సంతోష్‌నగర్‌కు చెందిన షేక్ కరిముల్లా కుమారుడు షేక్ అలీమ్ ప్రస్తుతం ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బీటెక్ చదివే రోజుల్లో జిమ్‌కు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. కొంతకాలానికి బాడీ బిల్డింగ్ పోటీలపై ఆసక్తి పెంచుకున్నాడు. 2018 నుంచి తీవ్ర కసరత్తు చేశాడు. 2020లో శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్ర స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్న అలీమ్ 5వ స్థానంలో నిలిచాడు. తర్వాత హైదరాబాద్‌లో జరిగిన మిస్టర్ తెలంగాణ పోటీల్లో పాల్గొని టాప్ టెన్‌లో స్థానం సాధించాడు. 2023లో జరిగిన మిస్టర్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో రెండో స్థానాన్ని కై వసం చేసుకుని జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగిన జాతీయపోటీల్లో దాదాపు 2,000 మంది పాల్గొనగా టాప్‌టెన్‌లో నిలిచాడు.
ఆ టైటిల్ కోసం..
అలీమ్ మిస్టర్ ఆసియా పోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించి దేశానికి పేరు తేవడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. దీని కోసం వచ్చే డిసెంబర్ లేదా 2026 ఏడాది ప్రారంభంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో మరోసారి పాల్గొననున్నట్లు తెలిపాడు. దీని కోసం ప్రస్తుతం కఠోరమైన శిక్షణ తీసుకుంటున్నాడు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించాలంటే వరుసగా మూడుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఒకటి లేదా రెండో స్థానంలో నిలవాల్సి ఉందని, ఈ లక్ష్యాన్ని చేరడంతోపాటు, మిస్టర్ ఆసియా టైటిల్ సాధించేందుకు కష్టపడుతున్నట్లు చెప్పాడు.
పోటీల కోసం కఠోర సాధన
పోటీల కోసం అలీమ్ నెల్లూరులోని ఓ జిమ్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఓ అంతర్జాతీయ కోచ్ రోజూ ఆన్‌లైన్‌లో ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తున్నాడు. పోటీలకు సిద్ధమయ్యే క్రమంలో భిన్నమైన ఆహార అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అలీమ్ ప్రతి నెలా తన ఆహారం కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. అతనికి పేదరికం పెద్ద సవాల్‌గా మారింది. పోటీలకు శిక్షణ తీసుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కందుకూరులో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేసే తండ్రి కరిముల్లాకు కుమారుడి శిక్షణకు అవసరమయ్యే మొత్తాన్ని భరించడం కష్టతరంగా మారింది. ఎవరైనా తనని స్పాన్సర్ చేయడానికి ముందుకొస్తే కచ్చితంగా అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
పోటీల్లో రాణిస్తున్న కందుకూరు యువకుడు
60 కేజీల విభాగంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ
మిస్టర్ ఆసియా టైటిల్
అందుకోవడమే లక్ష్యం


