నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గుర్తుతెలియని వృద్ధురాలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరులోని కరెంటాఫీస్ గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే రైలు పట్టాలపై శుక్రవారం జరిగింది. మృతురాలి వయసు 70 నుంచి 75 ఏళ్ల లోపు ఉంటుందని భావిస్తున్నారు. మెడలో ఎర్రని దారం ధరించి ఉంది. మృతదేహానికి సమీపంలో ఎరుపు రంగు దుప్పటి పడి ఉంది. నెల్లూరు రైల్వే ఎస్సై జి.మాలకొండయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పంటకాలువలో
మృతదేహం
నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని ములుమూడి గ్రామానికి సమీపంలోని పంటకాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు. మృతుడు బులుగు, నలుపు, ఎరుపు రంగు గడుల ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ధరించి ఉన్నాడు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక..
● వ్యక్తి బలవన్మరణం
నెల్లూరు(క్రైమ్): అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులోని పోలీస్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దర్గామిట్టలోని పోలీస్ కాలనీలో డి.అనిల్ కుమార్ (39), మానస దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనిల్ బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను అప్పులపాలయ్యాడు. ఈ విషయమై దంపతుల నడుమ తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల అప్పుల బాధలు అధికమయ్యాయి. గురువారం రాత్రి అనిల్ తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలోకి వెళ్లిన అనిల్ ఎంతకీ బయటకు రాకపోవడంతో భార్యాపిల్లలు తలుపులు బలంగా నెట్టడంతో తెరుచుకున్నాయి. ఫ్యాన్‌కు వేలాడుతున్న అనిల్ కుమార్‌ను కిందకు దించి చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతుడి తల్లి నారాయణమ్మ శుక్రవారం దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వన్యప్రాణులకు
తాగునీటి ఏర్పాట్లు
ఉదయగిరి: రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్లలో ట్యాంకర్ల ద్వారా నీరు నింపుతున్నట్లుగా జిల్లా అటవీ శాఖాధికారి మహబూబ్‌బాషా తెలిపారు. ‘వన్యప్రాణుల గొంతెండుతోంది’ అనే శీర్షికన శుక్రవారం సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి ఆయన స్పందించారు. పెంచల నరసింహ వైల్డ్ లైఫ్ అటవీ ప్రాంతంలో ఇప్పటికే వన్యప్రాణులకు నీటివసతి కల్పించినట్లు తెలిపారు.
వృద్ధురాలి ఆత్మహత్య


