● భారత వరి పరిశోధన స్థానం
ప్రధాన శాస్త్రవేత్త సుబ్బారావు
కందుకూరు రూరల్: ‘రైతులే శాస్త్రవేత్తలుగా మారాలి. నూతన వంగడాలకు రూపకల్పన చేసి వారి పేరు మీదే రిజిస్టర్ చేసుకుని లైసెన్స్, హక్కులు పొందాలి’ అని భారత వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఎల్‌వీ సుబ్బారావు అన్నారు. కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో పంట వంగడాల పరిరక్షణ, రైతు చట్టం 2001 (పీపీవీ అండ్ ఎఫ్‌ఆర్‌ఏ) అనే అంశంపై శుక్రవారం ఒకరోజు శిక్షణ నిర్వహించారు. కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ జి.ప్రసాద్‌బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుబ్బారావు మాట్లాడుతూ రైతులు వారి పొలంలో తిరిగే సమయంలో క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేక లక్షణాలున్న మొక్కల్ని గుర్తించాలన్నారు. వాటిని వేరు చేసి 2 నుంచి 3 సంవత్సరాలు పండించాలన్నారు. పూర్తి వివరాలతో అథారిటీకి దరఖాస్తు చేసుకుంటే తద్వారా వాటిని పరిశీలించి ఆ రైతుకు హక్కులను ఇస్తారన్నారు. ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ విజయభాస్కర్ మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా 8,500 హక్కులను రైతులకు అందించామన్నారు. సీడీఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త అనురాధ మాట్లాడుతూ రైతుల దగ్గర ప్రత్యేక లక్షణాలున్న వంగడాలుంటే కేవీకే దృష్టికి తీసుకురావాలన్నారు. ఔత్సాహికుల ద్వారా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉత్తమ రైతులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. రైతులతో శాస్త్రవేత్తలు ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు అనసూయ, వ్యవసాయాధికారులు వి.రాము, హేమంత్ భరత్, రైతులు, రైతు మహిళలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మాధవ, కృష్ణారెడ్డి, రాజు, ఉద్యాన కళాశాల ఇంటర్న్‌షిప్ విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


