నెల్లూరు రూరల్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ వీసీ హాల్లో శుక్రవారం నీట్‌పై కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే నెల 4వ తేదీన నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పరీక్షను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో సుమారు 4 వేలకు పైగా హాజరుకానున్నారని ప్రభుత్వ విద్యాసంస్థలను మాత్రమే కేంద్రాలుగా ఎంపిక చేయాలన్నారు. నెల్లూరు సిటీకి దగ్గరగా భద్రత, రవాణాకు ఇబ్బందుల్లేకుండా ఉండే కేంద్రాలను రెండు రోజుల్లో ఎంపిక చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డీఈఓ బాలాజీరావు, కేంద్రియ విద్యాలయ ప్రిన్సిపల్ కె.శంకరయ్య, సీనియర్ ఉపాధ్యాయురాలు దొరసానమ్మ, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


