ఉదయగిరి: నియోజకవర్గంలోని పలు మండలాల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు బుసలు కొడుతున్నాయి. అంతర్గతంగా ఉన్న విభేదాలు తన్నులాటకు దారి తీస్తున్నాయి. అది కూడా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమక్షంలోనే ఈ గొడవలు, దెబ్బలాటలు జరుగుతుండటం విశేషం. ముఖ్యంగా కాకర్ల, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు వర్గీయులు మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. కాకర్ల తన వర్గీయులను సమర్థిస్తూ తమపైకి ఉసిగొల్పుతున్నాడనే అనుమానం బొల్లినేని వర్గీయుల్లో ఉంది.
ఇలా మొదలు
సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు సురేష్ సేవా కార్యక్రమాల పేరుతో నారా లోకేశ్ ఆశీస్సులు తీసుకుని ఉదయగిరిలో మకాం పెట్టారు. ఈ పరిణామం అప్పుటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న బొల్లినేనికి నచ్చలేదు. దీంతో కాకర్ల సేవా కార్యక్రమాలకు సహకరించలేదు. లోకేశ్ అండదండలు ఉండటంతో ఇబ్బందులు ఎదురైనా సురేష్ తమ కార్యకలాపాలు ఆపలేదు. గ్రామాల్లో బృందాలను ఏర్పాటు చేసుకుని రామారావు వర్గానికి ధీటుగా నిలిచారు. పార్టీ అధినేత చంద్రబాబు మద్దతు పూర్తిగా తనకే ఉందని బొల్లినేని నమ్మారు. యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి స్వాగతం పలికేందుకు ప్రయత్నించిన సురేష్‌ను బొల్లినేని వర్గీయులు అడ్డుకున్నారు. ఇదంతా గమనించిన లోకేశ్ స్వయంగా సురేష్‌తో మాట్లాడి టికెట్‌పై హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మండలాల వారీగా తనను ఇబ్బంది పెట్టిన బొల్లినేని వర్గీయులను దూరం పెట్టడం ప్రారంభించారు. దీంతో గ్రామాల్లో టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి.
ఎమ్మెల్యే సమక్షంలోనే..
● ఈనెల 26వ తేదీన ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సమక్షంలో రెండు చోట్ల తమ్ముళ్లు తగాదా పడ్డారు. జెడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి వర్గాల మధ్య గొడవ జరిగింది. దీనిపై కాకర్ల మౌనం వహించారు. దీంతో చెంచలబాబు మనస్తాపం చెందినట్లు సమాచారం. దీనిపై పోలీసులకు కూడా ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి.
● 27వ తేదీ రాత్రి వింజమూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాకర్ల ముందే కొండాపురం టీడీపీ సీనియర్ నేతల మధ్య గొడవ జరిగింది. కాకర్ల వర్గానికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దామా మహేశ్వరరావు, బొల్లినేని వర్గానికి చెందిన సొసైటీ మాజీ అధ్యక్షుడు యారవ కృష్ణయ్య మధ్య గొడవ జరిగి చెయ్యి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో యారవ మనస్తాపం చెంది క్యాంప్ కార్యాలయం నుంచి అలిగి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని జిల్లా పార్టీ పెద్దల దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీంతో వారు కాకర్లను పిలిచి మహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్దల ఆదేశాల మేరకు ఎమ్మెల్యే శనివారం రాత్రి ఆ రెండు వర్గాలను పిలిచి మాట్లాడారు. రాజీ చేసేంందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనూ రెండు వర్గాలు మరోసారి గొడవ పడ్డాయి. కాకర్ల జోక్యం చేసుకుని అంతా మర్చిపోవాలన్నారు. ఇద్దరి చేతులు కలిపి పనిచేయాలని సూచించారు. కాగా ఆరునెలలపాటు కొండాపురం మండలంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని దామాను ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో ఆయన, అనుచరులు అలకబూని వెళ్లిపోయారు.
● వరికుంటపాడు మండలంలో టీడీపీలో విభేదాలున్నాయి. ఇక్కడ బొల్లినేని వర్గీయులకు ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తూ.. తమను దూరం పెడుతున్నారనే భావన సురేష్ వర్గీయుల్లో ఉంది.
● దుత్తలూరు మండలంలో తమకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇవ్వలేదనే బాధతో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి మదన పడుతున్నారు. పైగా ఇటీవల బొల్లినేని, కంభం కలిసి కొంతసేపు ముచ్చటించుకోవడం, ప్రస్తుతం ఎమ్మెల్యే పాల్గొంటున్న కార్యక్రమాల్లో కంభం కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పూర్తిగా సహకరించిన మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డిలు ఎమ్మెల్యే కాకర్ల పట్ల కినుక వహించారనే ప్రచారం జరుగుతోంది.
సీఎంకు ఫిర్యాదు
ఇటీవల నియోజవర్గానికి చెందిన కొందరు సీనియర్ నేతలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారంటూ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీని వెనుక బొల్లినేనితోపాటు మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉందని కాకర్ల అనుమానిస్తున్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నానని, కొందరు కావాలని ఫిర్యాదు చేస్తున్నారని ఆయన అధినేతకు చెప్పినట్లు తెలుస్తోంది.
ఉదయగిరి నియోజకవర్గంలో
అసమ్మతి సెగలు
నానాటికీ పెరుగుతున్న విభేదాలు
ఎమ్మెల్యే సమక్షంలోనే కొట్లాట
కాకర్లపై సీఎంకు ఫిర్యాదు చేసిన
సీనియర్ నేతలు
లోకేశ్ అండదండలతో సీరియస్‌గా
తీసుకోని శాసనసభ్యుడు


