సీసీ కెమెరాల షాపులో అగ్నిప్రమాదం
● రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు విక్రమ్ నగర్‌లోని సీసీ కెమెరాల దుకాణంలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక అధికారుల కథనం మేరకు.. నగరానికి చెందిన శ్రీధర్ విక్రమ నగర్‌లోని రెండంతస్తుల భవనంలో కింద పోర్షన్‌లో కార్యాలయం, పై పోర్షన్‌లో సీసీ కెమెరాల షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఎప్పటిలాగే పదిగంటల సమయంలో వాటిని మూసివేశాడు. సుమారు 11 గంటల ప్రాంతంలో పైపోర్షన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అగ్నిమాపక అధికారులు, వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. నెల్లూరు ఏడీఎఫ్‌ఓ ఎస్.వేణుగోపాల్ రెండు ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజిన్లతో నీరు వేగంగా కొట్టినా, ఫోమ్‌ను ఉపయోగించినా మంటలను అదుపు చేయలేకపోయారు. దీంతో సిబ్బంది పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ల కిటికీలో నుంచి దానికి ఆనుకుని ఉన్న మూడంతస్తుల భవనంపైకి చేరుకుని ఆరుగంటలపాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సహకారం అందించారు. సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లు, బ్యాటరీలు, అడాప్టర్‌లు ఇలా కాలే సామగ్రి అధికంగా ఉండటంతోనే మంటలు అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. బ్యాటరీలు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
సీసీ కెమెరాల షాపులో అగ్నిప్రమాదం


