టిప్పర్ చక్రాల కింద పడి వ్యక్తి మృతి
● తమ్ముడికి తీవ్రగాయాలు
నెల్లూరు(క్రైమ్): మోటార్‌బైక్‌పై వెళ్తూ టిప్పర్‌ను అధిగమించే క్రమంలో వెనుక చక్రాల కిందపడి అన్న మృతిచెందగా తమ్ముడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం నెల్లూరు బోసుబొమ్మ సమీపంలోని ఆర్‌కేటీ పెట్రోట్ బంకు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన హరిరామ్‌కుమార్ (23), సీతారామ్ అనే అన్నదమ్ములు నాలుగు నెలల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చి పొర్లుకట్ట వద్ద నివాసం ఉంటున్నారు. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. హరిరామ్‌కుమార్‌కు తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. ఆదివారం సాయంత్రం అన్నదమ్ములిద్దరూ బైక్‌పై బోసుబొమ్మ వైపునకు బయలుదేరారు. ఆర్‌కేటీ పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న టిప్పర్‌ను అధిగమించే క్రమంలో బైక్ దానికి రాసుకుంది. దీంతో బైక్ అదుపు తప్పి అన్నదమ్ములిద్దరూ కిందపడ్డారు. టిప్పర్ చక్రాల కిందపడి హరికుమార్ తలపగిలి అక్కడికక్కడే మృతిచెందగా, సీతారామ్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.


