రీసర్వేకు రైతులుసహకరించాలి
● కలెక్టర్ ఆనంద్
దుత్తలూరు: రైతులంతా సహకరిస్తేనే రీసర్వే విజయవంతంగా కొనసాగుతుందని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని వెంకటంపేటలో రీసర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అవగాహనా ర్యాలీ చేపట్టారు. ఉపాధిహామీ పథకం కింద మూగజీవాల తాగునీటి కష్టాలు తీర్చే నీటితొట్ల నిర్మాణానికి భూమిపూజ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ కాలంనాడు భూముల రీసర్వే జరిగిందని, వందేళ్ల తర్వాత మరలా ప్రస్తుతం జరుగుతోందన్నారు. గతంలో చైన్ల ద్వారా రీసర్వే చేసేవారని, ప్రస్తుతం జీపీఎస్ విధానంలో రీసర్వే చేస్తుండటంతో ఎలాంటి తప్పిదాలు ఉండవన్నారు. పట్టా అసైన్‌మెంట్ భూముల్లో వివాదాలు అధికంగా ఉన్నాయని, రైతులు రీసర్వేను సద్వినియోగం చేసుకొని తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. రైతులకు నోటీసులు జారీచేసిన అనంతరమే రీసర్వే చేపట్టాలన్నారు. అంతకుముందు నందిపాడు ఎస్సీ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్‌వాడీ కార్యకర్త బోగ్యం సరస్వతి సెల్‌ఫోన్ తీసుకొని యాప్‌లో నమోదుచేసిన వివరాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం దుత్తలూరులో పీఎం సూర్యఘర్ పథకం కింద వినియోగదారులు ఏర్పాటుచేసిన సోలార్ సిస్టంను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ మల్లికార్జున, సీడీపీఓ సునీత, పీఆర్, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈలు మణికుమార్, రామకృష్ణారావు, ఐసీడీఎస్ సూపర్‌వైజరు షేక్ షాను, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దుత్తలూరు పర్యటనలో భాగంగా దుత్తలూరులోని సీడ్స్ సంస్థను కలెక్టర్ ఆనంద్ సందర్శించారు. ఆ సంస్థ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ వ్యవసాయ సాగు, విద్య, నైపుణ్య శిక్షణా తరగతులు, తదితర వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట సీడ్స్ సిబ్బంది ఉన్నారు.


