వక్ఫ్ బిల్లు ఆమోదం కక్షపూరితం
● ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో
మసీదు వద్ద నిరసన
నెల్లూరు(బారకాసు): కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని కక్షపూరితంగా తెచ్చిందని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మొహ్మద్ జియాఉల్‌హక్ అన్నారు. ఈ మేరకు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని పెద్దబజార్‌లో ఉన్న మర్కజ్ అహమదియా మసీదు వద్ద వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపడం శోచనీయమన్నారు. ఈ నల్లచట్టాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ బిల్లు మత స్వేచ్ఛ, సమానత్వం, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు షేక్ సిద్దిక్, సయ్యద్ ఐరాజ్, కోస్తాఆంధ్ర మైనార్టీ రైట్స్ అధ్యక్షుడు మొహ్మద్ ఉమర్, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ అజీజ్, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు షాహుల్, అమానుల్లా, అంజాద్, షబ్బీర్, రఫీ, షఫీ పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు.


