తప్పుచేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు
నెల్లూరు (పొగతోట): గృహ నిర్మాణాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా భారీస్థాయిలో అవినీతి జరిగిందని, అవినీతికి కారకులైన వారిని వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పి.పార్థసారథి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో గృహనిర్మాణాలపై అధికారులతో సమీక్షించారు. సమావేశంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ ఆనంద్, కోవూరు, కావలి, ఉదయగిరి శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, హౌసింగ్ ఎండీ రాజబాబు హాజరయ్యారు. ముందుగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గృహ నిర్మాణాలకు అధికంగా నగదు చెల్లిస్తోందన్నారు. ఇప్పటికే జిల్లాలో అనేకమంది లబ్ధిదారులకు వారి వారి అకౌంట్లలో నగదు జమచేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు మాకెవరికీ తెలియదే అన్నట్లు అధికారులను ప్రశ్నించారు. అధికారులు నగదు పంపిణీకి సంబంధించి స్థానిక శాసనసభ్యుల కార్యాలయాల్లో పూర్తి వివరాలు అందజేశామని తెలియజేశారు. కోవూరు, ఉదయగిరి శాసనసభ్యులు మాట్లాడుతూ మాకు సమాచారమే లేదని అధికారులను ప్రశ్నించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి కలుగజేసుకొని ఈసారైనా నగదు పంపిణీకి సంబంధించి స్థానిక శాసనసభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా రాబోవు రోజుల్లో మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. కాలనీలకు లేఅవుట్‌లు ఏర్పాటుచేసిన ప్రాంతాలలో ఉపాధిహామీ పథకం ద్వారా రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. మంత్రి ఆనం మాట్లాడుతూ లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇకపై అధికారులందరూ శ్రద్ధగా పనిచేసి ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. అనంతరం కోవూరు, ఉదయగిరి, కావలి శాసనసభ్యులు స్థానిక గృహనిర్మాణ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో గృహనిర్మాణాల్లో భారీస్థాయిలో అవినీతి జరిగిందన్నారు. నాసిరకంగా ఇళ్లు నిర్మించి గిరిజనులకు అన్యాయం చేశారన్నారు. తప్పు చేసిన వారిని క్షమించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆకలితో అలమటించిన అధికారులు
గృహనిర్మాణ శాఖమంత్రి పార్థసారథి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు అధికారులతో సమావేశం అని సమాచారమిచ్చారు. 12.30 గంటల నుంచి సమావేశానికి అధికారుల రాక ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా సమావేశ మందిరం అధికారులతో నిండిపోయింది. మంత్రి రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. అధికారులు భోజనం చేయకుండా సమావేశానికి హాజరయ్యారు. మంత్రుల జాప్యం కారణంగా అధికారులు ఆకలితో అలమటించారు. చివరికి స్నాక్స్‌తో అధికారులు కాస్త ఉపశమనం పొందాల్సిన పరిస్థితి వచ్చింది. తీరిగ్గా మంత్రి మధ్యాహ్నం 3.10 గంటలకు సమావేశాన్ని ప్రారంభించారు.
అక్రమాలకు పాల్పడిన
వారిపై క్రిమినల్ కేసులు
లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు
మంత్రులు ఆనం, పార్థసారథి


