ఉదయగిరి: వరికుంటపాడు మండలం కనియంపాడు వీఏఎస్ పరిధిలోని కొత్తపేట బీట్‌లో అటవీ ప్రత్యామ్నాయ వనీకరణ పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ పథకంలో అభివృద్ధి పనుల్లో ల్యాండ్ చుట్టూ కంచె (ఇనుప ముళ్లకంచె) వేయకుండానే నిధులు డ్రా చేసి స్వాహా చేశారనే విమర్శలు ఉన్నాయి. కోటి రూపాయల అంచనా వ్యయంతో జరగాల్సిన పనులు చేయకుండానే వీఏఎస్ ఖాతా నుంచి రూ.75 లక్షలు నిధులు డ్రా చేసి పర్సంటేజ్‌ల ప్రకారం పంచుకుని మిన్నుకుండిపోయారు.
వరికుంటపాడు బీట్ కొత్తపేట ఏరియాలో
ఉదయగిరి ఫారెస్టు రేంజ్ పరిధిలోని కృష్ణంపల్లి సెక్షన్‌లోని వరికుంటపాడు బీట్ కొత్తపేట ఏరియాలో 118 హెక్టార్లు భూమిని ఓ కంపెనీ కొనుగోలు చేసి అటవీశాఖకు అప్పగించింది. ఈ భూమిలో అటవీ ప్రత్యామ్నాయ వనీకరణ పథకం ద్వారా అభివృద్ధి పనులు చేస్తున్నారు. గతేడాది నుంచి పనులు జరుగుతున్నాయి. ఈ భూమి చుట్టు ఇనుప కంచె ఏర్పాటుకు ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో రూ.75 లక్షలు డిపార్టుమెంట్ వీఏఎస్ జాయింట్ అకౌంట్‌లో జమ చేసింది. ఈ నిధులు ఉపయోగించి కంచె ఏర్పాటు చేయాలి. కానీ పనులు జరగలేదు. నిధులు మాత్రం ఖాతా నుంచి డ్రా చేసి స్వాహా చేశారు.
వీఏఎస్ పేరుతో దోపిడీ
కనియంపాడు వీఏఎస్‌లో ఉన్న చైర్మన్, వైస్ చైర్‌పర్సన్లు ఇద్దరూ అక్షరాస్యులు కారు. వీరి అమాయకత్వాన్ని అడ్డంపెట్టుకొని ఎఫ్‌బీఓ, సెక్షన్ అధికారి తమ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు. అన్ని పనులు వారి పర్యవేక్షణలో జరుపుకుంటూ వీఏఎస్‌ను నిర్వీర్యం చేశారు. కిందిస్ధాయి నుంచి పైస్ధాయి వరకు పర్సంటేజ్‌లు ఇస్తుండటంతో తాము ఏమీ చేసినా ఏమీ కాదు అనే భావన ఆ క్షేత్రస్ధాయి అధికారుల్లో ఉంది. ఆ భావనే అవినీతికి దారితీస్తోంది. అందులో బాగంగా వీఏఎస్ ఖాతాలో ఉన్న నిధులు డ్రా చేశారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అటవీ ప్రత్యామ్నాయ వనీకరణ
పథకంలో అక్రమాలు
రూ.75 లక్షలు స్వాహా
బీట్, సెక్షన్ అధికారుల ప్రమేయం


