అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
పొదలకూరు : ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని డ్వామా పీడీ గంగాభవాని హెచ్చరించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన పనులపై మండల స్థాయి సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ మండలంలోని 30 పంచాయతీల్లో పది రోజుల పాటు 17 బృందాలు సామాజిక తనిఖీలు నిర్వహించి ఇచ్చిన నివేదికల ప్రకారం అవకతవకలకు పాల్పడిన వారిపై రికవరీలు విధించడంతోపాటు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. పులికల్లు, ఆర్‌వైపాళెం, తోడేరు, వావింటపర్తి, పార్లపల్లి, నావూరు, మొగళ్లూరు పంచాయతీల్లో పనులు సక్రమంగా జరిగినట్లు నివేదికలు వచ్చాయన్నారు. మిగిలిన పంచాయతీల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి రూ.74,08,805 రికవరీలు విధించినట్లు వెల్లడించారు. పొదలకూరు రూ.17 లక్షలు, నేదురుమల్లి రూ.16 లక్షలు, బిరదవోలు రూ.17 లక్షలు అత్యధికంగా రికవరీలకు అదేశించామన్నారు. సంబంధిత టీఏలు, ఎఫ్‌ఏల నుంచి రికవరీ చేస్తామన్నారు.
సస్పెన్షన్ వేటు
ఈసీ వై.సుధాకర్, టీఏలు నాగార్జున, త్రిబునేష్‌బాబులను సస్పెండ్ చేస్తున్నట్లు డ్వామా పీడీ వెల్లడించారు. బిరదవోలు, చాటగొట్ల, విరువూరు, మహ్మదాపురం, ఇనుకుర్తి, దుగ్గుంట ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా సస్పెండ్ చేశామన్నారు. ఈ సమావేశంలో డీవీఓ డీ.విజయలక్ష్మి, ఏపీడీ గాయత్రి, క్వాలిటీ కంట్రోల్ అధికారి సతీష్‌బాబు, అంబుడ్స్‌మెన్ వెంకటరెడ్డి, ఏపీఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు టీఏలు, ఈసీ సస్పెన్షన్
ఆరుగురు ఎఫ్‌ఏలు కూడా
రూ.74 లక్షలు రికవరీకి
ఆదేశాలు
డ్వామా పీడీ గంగాభవాని


