మా బిడ్డ బతికే ఉందో లేదో చెప్పండి సారూ
ఆత్మకూరు: మా బిడ్డ 40 రోజుల క్రితం అదృశ్యమైందని, అనుమా నం ఉండే యువకుడి వివరాలు తెలుపుతూ ఏఎస్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తమ బిడ్డ బతికి ఉందో, లేదో చెప్పండంటూ ఆ యువతి తల్లి డీఎస్పీ కార్యాలయం ఎదుట విలపించింది. తన బిడ్డ ఆచూకీ తెలపాలంటూ ఆ తల్లి న్యాయవాది నందా ఓబులేసు, అలీ, పలువురు మహిళలతో కలిసి ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన వ్యక్తం చేసింది. బాధితుల కథనం మేరకు.. ఏఎస్‌పేట మండలం రాజవోలుకు చెందిన హబీబున్నీసా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమార్తె (20) ఆత్మకూరులోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. కళాశాలలో పరిచయమైన ఇందుకూరుపేట మండలం జేజేపేటకు చెందిన చేవూరు భరణీధర్ మాయమాటలు చెప్పి ఫిబ్రవరి 26న తీసుకెళ్లిపోయాడు. మరుసటి రోజు ఏఎస్‌పేట ఎస్సై సైదులుకు ఫిర్యాదు చేసి వారం రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిరగ్గా భరణీధర్ తల్లిని స్టేషన్‌కు పిలిపించారు. ఆమెను విచారణ చేస్తే ఆమె పోలీసులకే ఎదురు సమాధానం చెప్పిందని బాధితులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి స్టేషన్ చుట్టూనే తిరుగుతున్నా పూర్తి స్థాయి విచారణ చేయకపోవడంతో తమ కుమార్తె ప్రాణాలతో ఉందో, లేదో అనే అనుమానం వ్యక్తం అవుతుందని యువతి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. భరణీధర్ ఇప్పటికే కళాశాలలో మురగళ్ల, రాయచోటి, ఆత్మకూరుకు చెందిన ముగ్గురు బాలికలను మోసం చేశాడనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఇటీవల ఎస్సైని మరోసారి కలిసి విన్నవించుకోగా ఆయన విసుక్కున్నారని, మీరే వెతుక్కోవాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పలువురు మహిళలతో కలిసి ఆత్మకూరు డీఎస్పీని కలిసేందుకు వచ్చినట్లు వారు తెలిపారు. అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారని గతంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు విమర్శలు చేశారని, ప్రస్తుతం ఏఎస్‌పేట, మర్రిపాడు, అనంతసాగరం పోలీసు స్టేషన్ల పరిధిలోనే ముగ్గురు అదృశ్యమై రోజులు గడుస్తున్నా.. ఈ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు లేవని మహిళలు మండి పడ్డారు. డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో ఆత్మకూరు సీఐ జి గంగాధర్, ఎస్సై ఎస్‌కే జిలానీ అక్కడకు చేరుకుని బాధిత మహిళలతో మాట్లాడారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి ఎక్కడున్నా తీసుకు వస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అదే సమయంలో సీఐ ఆదేశాల మేరకు ఆత్మకూరుకు వచ్చిన ఏఎస్‌పేట ఎస్సై సైదులును మహిళలు చుట్టుముట్టారు. ఆ సమయంలో మర్రిపాడు మండలం బాట గ్రామానికి చెందిన గంగిశెట్టి శ్రీనివాసులు కుమార్తె (16)ను మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి తీసుకెళ్లాడని ఆ గ్రామస్తులు వచ్చి సీఐకి ఫిర్యాదు చేయడం గమనార్హం.
40 రోజుల క్రితం మిస్సింగ్ అయిన యువతి
తల్లి ఆందోళన
డీఎస్పీ కార్యాలయం ఎదుట మహిళల నిరసన


