50 నుంచి 100 కౌంట్ వరకు ఇతర దేశాలకు ఎగుమతులు
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ట్రంప్ సుంకం దెబ్బకు ధరలు భారీగా పతనం
అమెరికాలో 20, 30, 40, 50 కౌంట్లకే మార్కెట్
టన్నుపై రూ.40 వేల నుంచి రూ.80 వేలు తగ్గింపు
రొయ్య పిల్లల ధరలు, ఫీడ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు నిలకడగా ఉండేలా, ధర గిట్టుబాటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది జనవరిలో 30 కౌంట్ రొయ్య ధర కిలో రూ.600 వరకు ఉంది. తర్వాత క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.400 స్థాయికి చేరింది. సగటున కిలో రూ.200 తగ్గింది. 50 కౌంట్ రొయ్యలకు ఇప్పుడు రూ.300 మాత్రమే దక్కుతోంది.
– సొలా మహేష్, ఆక్వా రైతు, అల్లూరు
కావలి: జిల్లాలో ఆక్వాకు గడ్డు పరిస్థితులు ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాజా సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రావడంతో ఆ ప్రభావం రొయ్యల ఎగుమతి ధరపై పడింది. 100 కౌంట్ రొయ్య ధర కిలో రూ.240 నుంచి రూ.200కి తగ్గిపోయింది. వాస్తవానికి అమెరికా ప్రజలు 50, 40, 30, 20 కౌంట్ ఉండే రొయ్యలను కొనడానికి ఇష్టపడతారు. ఆ కౌంట్లలోని రొయ్యలనే అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. ట్రంప్ సుంకాన్ని సాకుగా చూపించి అన్ని కౌంట్లపై కిలోకు రూ.40 నుంచి రూ.80 వరకు తగ్గించారు. టన్నుపై రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు ధరలు పతనమయ్యాయి.
చైనా మార్కెట్‌పై దృష్టి
అమెరికా సుంకాలను దృష్టిలో పెట్టుకుని 50 కౌంట్ కంటే తక్కువ కౌంట్ ఉన్న రొయ్యల కొనుగోలును ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, ఎగుమతిదారులు నిలిపివేశారు. 50 కౌంట్ కంటే ఎక్కువ కౌంట్ ఉన్న రొయ్యలకు ఇతర దేశాల్లోనూ మార్కెట్ ఉండడంతో ప్రధానంగా చైనా మార్కెట్‌పై ఎగుమతిదారులు దృష్టి పెట్టారు. కిలోకు 50, 60, 70, 80, 90, 100 కౌంట్ ఉన్న రొయ్యలను ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. కిలోకు 100 కౌంట్ రూ.240 ఉండగా రూ.200లకు తగ్గించారు. 60 కౌంట్ ధర రూ.330 ఉండగా రూ.250కు తగ్గించేశారు. 50 నుంచి 100 కౌంట్ ఉన్న రొయ్యలకు చైనా మార్కెట్‌లో డిమాండ్ ఉంది.
ఏటా 2.25 లక్షల టన్నుల ఎగుమతి
సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలో 110 కి.మీ. సముద్ర తీరం వెంబడి ఉలవపాడు, గుడ్లూరు, కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు తదితర 9 మండలాల పరిధిలో 55,000 మంది మత్స్యకారులు సముద్రంలో వేట సాగిస్తున్నారు. 30,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. సముద్రం వేట ద్వారా లభించే రొయ్యలు, సాగు ద్వారా లభ్యమయ్యే రొయ్యలు వెరసి ఏటా 2.25 లక్షల టన్నులు ఎగుమతి అవుతాయని అంచనా. అమెరికా, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు, జపాన్ తదితర దేశాలకు జిల్లా నుంచి రొయ్యలు ఎగుమతులు అవుతుంటాయి. వైజాగ్, కృష్ణపట్నం, కాకినాడ, చైన్నె పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. జిల్లా పరిధిలో ఏడాదికి సుమారు 10 లక్షల టన్నుల మత్స్య సంపద వస్తుంటే, అందులో సుమారు 4 లక్షల టన్నులు స్థానికంగా విక్రయాలు జరుగుతున్నాయి. మిగిలిన 6 లక్షల టన్నులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో చేపలు మాత్రం ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా, రొయ్యలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
ట్రంప్ దెబ్బ.. మన రొయ్యకే
అమెరికా మార్కెట్‌లో మన దేశం రొయ్యలతోపాటు ఈక్వెడార్ దేశం నుంచి వచ్చే రొయ్యలకే అత్యధిక డిమాండ్ ఉంది. అయితే మన దేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే రొయ్యలపై 26 శాతం సుంకం విధించిన ట్రంప్ ఈక్వెడార్ దేశం నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై 10 శాతం మాత్రమే సుంకం విధించడం గమనార్హం. అమెరికా మార్కెట్‌లో మన దేశం రొయ్యల ధరలు అధికంగా ఉంటే, ఈక్వెడార్ దేశం రొయ్యలు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి. ఈ పరిణామంతో అమెరికా మార్కెట్ నుంచి మన దేశం రొయ్యలు కొనుగోలు చేసే పరిస్థితి తగ్గిపోతోంది.
రొయ్యలు
ఆర్థికంగా చితికి పోతున్నాం
అసలే ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఆక్వా రంగాన్ని అమెరికా సుంకం మరింత దెబ్బతీసింది. రొయ్యల ధరలు భారీగా పతనమయ్యాయి. మన దేశానికి సంబంధించి ఆక్వా ఉత్పత్తులు అమెరికాతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. కానీ ఒక్క అమెరికా సుంకం సాకు చూపించి అన్ని కౌంట్లపై భారీగా ధరలు తగ్గించడంతో ఆక్వా రైతులు విలవిలలాడుతున్నారు. ప్రధానంగా అమెరికాలో భారత్‌తోపాటు ఈక్వెడార్ రొయ్యలకే డిమాండ్ ఉంది. మన దేశ ఉత్పత్తులపై 26 శాతం సుంకం విధిస్తుండగా, ఈక్వెడార్ ఉత్పత్తులపై
10 శాతమే సుంకం విధిస్తుండడం గమనార్హం.
అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రొయ్యలకు సరైన ధర లభించకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నాం. ఫీడ్ ఖర్చు పెరిగింది. విద్యుత్ బిల్లులూ తడిసి మోపెడవుతున్నాయి. కిలో రొయ్యల ఉత్పత్తికి సగటున రూ.300 పెట్టుబడి అవుతుంది. అమ్మకం ద్వారా సగటున కిలోకు రూ.250 నుంచి రూ.270 మాత్రమే వస్తోంది. అంటే కిలోకు రూ.40 చొప్పున నష్టపోతున్నాం. మరో వైపు జనవరి నుంచి రొయ్యల ధరలు తగ్గాయి.
– వెంకటేష్, ఆక్వా రైతు, అల్లూరు
50 నుంచి 100 కౌంట్ వరకు ఇతర దేశాలకు ఎగుమతులు
50 నుంచి 100 కౌంట్ వరకు ఇతర దేశాలకు ఎగుమతులు
50 నుంచి 100 కౌంట్ వరకు ఇతర దేశాలకు ఎగుమతులు


