నేరాల కట్టడికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

నేరాల కట్టడికి చర్యలు

Apr 10 2025 12:17 AM | Updated on Apr 10 2025 12:17 AM

నేరాల

నేరాల కట్టడికి చర్యలు

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు సబ్‌ డివిజన్‌లో రైల్వే పోలీస్‌ సిబ్బంది కొరత వెంటాడుతోంది. 151 మందికి గానూ 60 శాతం మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఉన్నవారిపై పనిభారం పెరిగింది. నేర నియంత్రణ, కేసుల పరిష్కారం వారికి తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో ప్రయాణికుల భద్రతపై దృష్టిసారించలేకపోతున్నారు. బీట్‌ వ్యవస్థ నామమాత్రంగా మారింది. ఇది నేరగాళ్లకు కలిసొస్తోంది. ఇటీవల అంతర్రాష్ట్ర ముఠా సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి దోపిడీకి పాల్పడింది. దీనికితోడు వేసవిలో రైళ్లల్లో దోపిడీలు, దొంగతనాలు అధికంగా జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

చర్యలిలా..

సిబ్బంది కొరతను అధిగమించేందుకు రైల్వే పోలీస్‌ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వేసవి ముగిసేంత వరకూ తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని కేటాయించాలని ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను కోరారు. దీంతో జిల్లా పోలీస్‌ శాఖ నుంచి 33 మంది సిబ్బందిని కేటాయించారు. అందులో 20 మంది రైల్వే డీఎస్పీ వద్ద ఇప్పటికే రిపోర్ట్‌ చేశారు. మరో 13 మంది నేడో, రేపో రిపోర్ట్‌ చేయనున్నారు. వేసవి నేపథ్యంలో రైల్వే ప్లాట్‌ఫాంలపై నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను పబ్లిక్‌ అడ్రస్సింగ్‌ సిస్టం ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రి వేళల్లో జిల్లా మీదుగా రాకపోకలు సాగించే అన్ని రైళ్లల్లో సాయుధ పోలీసులతో బీట్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దష్ట్యా బీట్‌ సిబ్బంది వద్ద ఉన్న పుస్తకంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ అధికారుల ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంచారు. ఏదైనా నేరం జరిగిన వెంటనే ప్రయాణికులు ఉన్నతాధికారులకు, రైల్వే, స్థానిక పోలీసులకు సమాచారం చేరవేసేలా చర్యలు చేపట్టారు. దొంగతనాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో పికెట్లను ఏర్పాటు చేస్తున్నారు.

20 బీట్లు

గతంలో పది బీట్లు ఉండగా వాటిని 20కు పెంచారు. రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు జిల్లా మీదుగా రాకపోకలు సాగించే రైళ్లల్లో గస్తీని పెంచారు. ఒక్కో బీట్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్‌ ఉంటున్నారు. ఒక కానిస్టేబుల్‌ వద్ద తుపాకీ, లాఠీ, రెండు టార్చ్‌లైట్లు, విజిల్స్‌ ఉంటాయి. వీరు నిందితులను గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతోపాటుగా అదుపులోకి తీసుకుంటారు. నిందితులు ప్రతిఘటిస్తే కాల్చేందుకు వెనుకాడబోరు. క్రైమ్‌ పార్టీలు రైళ్లల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. వీక్లీ, స్పెషల్‌ రైళ్లల్లో ఆర్పీఎఫ్‌ సిబ్బంది బీట్‌లు నిర్వహిస్తున్నారు. ప్లాట్‌ఫాంలపై సిబ్బంది పోలీస్‌ మఫ్టీలో ఉంటున్నారు. వీరు రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు అక్కడ విధులు నిర్వహిస్తూ నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

రైళ్లల్లో సాయుధ గస్తీ

జిల్లా పోలీస్‌ శాఖ నుంచి 33 మంది

దొంగతనాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో పికెట్లు

నేరస్తులను కాల్చేందుకు వెనుకాడొద్దని ఆదేశాలు

నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్‌ పర్యవేక్షణలో నేరాల నియంత్రణకు ఆర్పీఎఫ్‌, స్థానిక పోలీసుల సహకారంతో చర్యలు చేపట్టాం. బీట్‌ వ్యవస్థను పటిష్టం చేశాం. నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నాం. పాతనేరస్తులు, అంతర్రాష్ట్ర ముఠాల కదలికలపై నిఘా పెంచాం. అన్ని రైళ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. దొంగలు కనిపిస్తే కాల్చేయమని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలి. – ఎ.సుధాకర్‌, నెల్లూరు రైల్వే సీఐ

నేరాల కట్టడికి చర్యలు 
1
1/1

నేరాల కట్టడికి చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement